
ముగిసిన జేవీవీ కళాజాతా శిక్షణ
విజయనగరం అర్బన్: జన విజ్ఞాన వేదిక రాష్ట్ర స్థాయిలో స్థానిక గురజాడ స్కూల్‌లో రెండు రోజులుగా నిర్వహిస్తున్న కళాజాతా శిక్షణ ఆదివారం ముగిసింది. ఈ సందర్భంగా జరిగిన సభలో జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.విశ్వనాధ్ మాట్లాడుతూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సెప్టెంబర్ నెలలో కర్నూలులో, అక్టోబర్ నెలలో విజయనగరంలో నిర్వహించిన శిక్షణ తరగతులు లక్ష్యాన్ని నెరవేర్చాయన్నారు. గుంటూరులో నవంబర్‌లో నిర్వహించనున్న శిక్షణా తరగతులను విజయవంతం చేయాలని కోరారు. ప్రధానంగా పాటల శిక్షణ, డప్పు శిక్షణ, మ్యూజిక్‌పై శిక్షణ పొందిన వారు, తర్వాత రోజులలో పాఠశాలలు, కాలేజీలలో చదువుతున్న విద్యార్థులతో సమావేశాలు జరపాలన్నారు. జాతీయ అధ్యక్షుడు డాక్టర్ ఎంవీఆర్ కృష్ణాజీ అధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి ఎ.ఫృధ్వీ, సాంస్కృతిక విభాగం రాష్ట్ర కన్వీనర్ గండ్రేటి శ్రీనివాసరావు, రాష్ట్ర నాయకులు గండ్రేటి లక్షణరావు, గండ్రేటి అప్పలనాయుడు, డాక్టర్ ఏవీ రాజశేఖర్, జిల్లా అధ్యక్షుడు ఆనంద్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ హెచ్.కృష్ణారావు, కోశాధికారి ఎస్.శివాజీ, విజయనగరం, విశాఖపట్టణం, అనకాపల్లి, పార్వతీపుం మన్యం, శ్రీకాకుళం జిల్లాల నుంచి జనవిజ్ఞాన వేదిక కార్యకర్తలు పాల్గొన్నారు.