
పేదల ప్రాణాలకు భరోసా కరువు..!
ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోవడంతో అష్టకష్టాలు పడుతున్న రోగులు నెట్‌వర్క్ ఆస్పత్రులు సమ్మె చేస్తున్నా.. పట్టించుకోని కూటమి సర్కార్ సొంత డబ్బులు పెట్టి వైద్యం చేయించుకుంటున్న రోగులు జిల్లాలో ఆరోగ్యశ్రీ ప్రైవేటు నెట్‌వర్క్ ఆస్పత్రులు 26
రెండు మూడు రోజుల్లో పరిష్కారం
విజయనగరం ఫోర్ట్:
జిల్లాలో రోగుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఆరోగ్యశ్రీ (ఎన్టీఆర్ వైద్య సేవ) సేవలు నిలిచిపోవడంతో అత్యవసర పరిస్థితుల్లో ఉన్న రోగులు సొంత డబ్బులు పెట్టి వైద్యం చేయించుకుంటున్నారు. వివిధ రకాల వ్యాధిగ్రస్తులతో పాటు గర్భిణులు కూడా డబ్బులు వెచ్చించి ప్రసవం జరిపించుకోవాల్సిన పరిస్థితి. ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోవడంతో రోగులు అష్టకష్టాలు పడుతున్నా కూటమి సర్కార్ స్పందించక పోవడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రజల ప్రాణాలంటే కూటమి సర్కార్‌కి లెక్కలేదన్న చందంగా వ్యవహారిస్తుందనే విమర్శలు పెద్దెత్తున వినిపిస్తున్నాయి. నెట్‌వర్క్ ఆస్పత్రులకు చెల్లించాల్సిన బకాయిలు చెల్లించకపోవడం వల్ల నెట్‌వర్క్ ఆస్పత్రులు సమ్మె బాట పట్టాయి.
పాత రోజులు గుర్తు చేసుకుంటున్న వైనం
ఆరోగ్యశ్రీ పథకం లేనప్పడు ఏదైనా జబ్బు చేస్తే ఇల్లుగాని.. భూమిగాని తాకట్టు పెట్టడం లేదా.. అమ్ముకోవడమో చేసేవారు. మళ్లీ అటువంటి పరిస్థితులే వచ్చాయని రోగులు గుర్తు చేసుకుంటున్నారు. పేదల ప్రాణాలకు ఆపద వస్తే అండగా నిలిచి వారి కి మేమున్నామని భరోసా కల్పించాల్సిన కూటమి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహారిస్తుందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
రూ.వేలు వెచ్చించి వైద్యం చేయించుకుంటున్న రోగులు
ఆరోగ్యశ్రీ (ఎన్టీఆర్ వైద్య సేవ) పథకం వర్తిస్తే రోగులకు ఉచితంగా వైద్య సేవలు అందుతాయి. ఒక్క పైసా కూడా ఖర్చు కాదు. ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆస్పత్రులకు కూటమి సర్కార్ చెల్లించాల్సిన బకాయిలు చెల్లించకపోవడం వల్ల వారు సేవలు నిలిపివేశారు. దీంతో వేలాది రుపాయిలు ఖర్చు పెట్టి వైద్యం చేయించుకుంటున్నారు. అపండిసైటీస్, పేగు వరపు, పేగు మడత పడడం, తీవ్రమైన కడుపునొప్పి, నిమోనియా వంటి అత్యవసర పరిస్థితు ల్లో ఉన్న రోగులు సొంత డబ్బులు పెట్టి వైద్యం చేయించుకుంటున్నారు. ఆయా వ్యాధులకు చికిత్స కోసం రూ.30 వేల నుంచి రూ.80 వేల వరకు రోగు లు ఖర్చు చేస్తున్నారు. గర్భిణుల ప్రసవం కోసం ఆస్పత్రిని బట్టి కొన్ని ఆస్పత్రుల్లో సాధారణ ప్రసవానికి రూ.20 వేలు నుంచి రూ.30 వేలు, మరి కొన్ని ఆస్పత్రుల్లో రూ.30 వేల నుంచి రూ.40 వేలు ఖర్చు చేస్తున్నారు. సిజేరియన్‌కు అయితే రూ.30 వేల నుంచి రూ.80 వేల వరకు ఖర్చు చేస్తున్నారు.
సమ్మె విరమింపజేసే చర్యలు చేపట్టని వైనం..!
ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆస్పత్రులు తమకు చెల్లించాల్సిన బకాయిలు చెల్లించాలని సమ్మె చేస్తున్నాయి. అత్యంత అత్యవసరమైన పథకం కాబట్టి దీనిపై తక్షణమే చర్యలు చేపట్టాల్సి ఉంది. కాని కూటమి సర్కార్ ఆ విధంగా చర్యలు చేపట్టడం లేదు. బకాయిలు చెల్లించాలని నెట్‌వర్క్ ఆస్పత్రులు పలుమార్లు ప్రభుత్వానికి వినతులు అందించారు. అయినప్పటకీ స్పందించకపోవడంతో నెట్‌వర్క్ ఆస్పత్రులు సమ్మెకు దిగాయి.
జిల్లాలో ప్రైవేట్ ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్
ఆస్పత్రుల వివరాలు
జిల్లాలో ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అభినవ్ ఆస్పత్రి, కొలపర్తి, సాయి పీవీఆర్, సాయి సూపర్ స్పెషాలిటీ, వెంకటరామ, ఆంధ్ర, మారుతి, పిజి స్టార్, స్వామి ఐ ఆస్పత్రి, నెప్రోఫ్లస్, మిమ్స్, మువ్వ గోపాల, కాస్వి ఆస్పత్రి, క్వీన్స్ ఎన్‌ఆర్‌ఐ, గాయిత్రి, పుష్పగిరి, తిరుమల మెడికవర్ ఆస్పత్రి, శ్రీనివాస్ నర్సింగ్ హోమ్, పిలిడోపియా ఆసుపత్రి, అమృత, సంజీవిని, శ్రీ బాపుజీ, సంజీవిని సూపర్ స్పెషాల టీ, సాయికృష్ణ, విజయ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి, వెంకటపద్మ ఆస్పత్రి ప్రైవేట్ ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆస్పత్రులు ఉన్నాయి. ఈ ఆస్పత్రుల్లో సమ్మె వల్ల వైద్య సేవలు నిలిచిపోయాయి.
గంట్యాడ మండలానికి చెందిన
పి.కనకరాజు రెండు రోజుల క్రితం
తీవ్రమైన కడుపునొప్పి రావడంతో కుటుంబ సభ్యులు విజయనగరంలోని ఓ ప్రైవేటు నెట్‌వర్క్ ఆస్పత్రిలో
చేర్పించారు. ఆరోగ్యశ్రీ సేవలు
నిలిచిపోవడంతో సొంత డబ్బులు పెట్టి వైద్యం చేయించుకుంటున్నారు.
ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆస్పత్రులు సమ్మె చేస్తున్నారు. రెండు, మూడు రోజుల్లో సమస్య పరిష్కారం అయ్యే అవకాశం ఉంది.
– డాక్టర్ కుప్పిలి సాయిరాం,
ఆరోగ్య శ్రీ జిల్లా కో ఆర్డినేటర్