
ఇంత నిర్లక్ష్యమా..!
రాజాం: మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో దివ్యాంగులకు అవసరమైన ట్రైసైకిళ్లు తుప్పు పట్టి పాడైపోతున్నాయి. మండలంలో దివ్యాంగులకు ఇచ్చేందుకు ఆరు నెలల కిందట వీటిని ఇక్కడకు తీసుకువచ్చారు. మొత్తం 40కి పైగా ట్రైసైకిళ్లు రాగా వీటిలో కొన్నింటిని పంపిణీ చేయకుండా వదిలేశారు. ఒక్కో ట్రైసైకిల్ సుమారు రూ.18వేలు. ఇంత నిధులు వెచ్చించిన అధికారులు లబ్ధిదారులకు అందించడంలో విఫలమయ్యారు. పోనీ వాటిని భద్రపరిచారా? అంటే అదీ లేదు. కార్యాలయ ఆవరణలో ఆరుబయటే వదిలేయడంతో పూర్తిగా పాడయ్యాయి. ట్రైసైకిళ్లు అవసరమైన వారు మండలంలో పలువురు ఉన్నా... దానికీ ఓ పంపిణీ పద్ధతి ఉందంటూ అధికారులు అలానే వదిలేశారు. వీటిని చూసిన పలువురు అధికారుల తీరును తప్పు పడుతున్నారు. రూ.వేలల్లో ఉండే వీటిని ఇంత నిర్లక్ష్యంగా వదిలేయడమేంటని పలువురు గుసగుసలాడుకుంటున్నారు.