మహారాణిపేట: జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అమలు చేయాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఎం.అభిషిక్త్ కిశోర్ అధికారులను ఆదేశించారు. రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధుల ఫ్లెక్సీలు, వాల్ పోస్టర్లు, హోర్డింగ్లను తొలగించాలని, విగ్రహాలకు ముసుగులు వేయడంతోపాటు శిలాఫలకాలపై పేర్లు కనిపించకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎస్ఎస్టీ, ఫ్లయింగ్ స్క్వాడ్, ఎంసీసీ, ఎన్నికల వ్యయ పర్యవేక్షణ బృందాలను ఏర్పాటు చేయాలని, పోలింగ్, కౌంటింగ్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూమ్లకు సంబంధించి సమగ్ర ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశించారు. సున్నిత, అత్యంత సున్నిత, కీలక పోలింగ్ కేంద్రాలను గుర్తించి నివేదిక సమర్పించాలన్నారు.
స్ట్రాంగ్ రూమ్లు, కౌంటింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు
విశాఖ విద్య: జీవీఎంసీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా స్ట్రాంగ్ రూమ్లు, కౌంటింగ్ కేంద్రాల్లో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్ అధికారులను ఆదేశించారు. ఏయూ సౌత్, నార్త్ క్యాంపస్లలో ఏర్పాటు చేస్తున్న స్ట్రాంగ్ రూములు, కౌంటింగ్ కేంద్రాలను బుధవారం జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్, ఇతర అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. సౌత్ క్యాంపస్లో మూడు, నార్త్ క్యాంపస్లో ఏడు కౌంటింగ్ కేంద్రాల్లో మౌలిక వసతులు, సిబ్బంది విధుల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లను పూర్తి చేయాలని సూచించారు. జీవీఎంసీ రిటర్నింగ్ అధికారి దయానిధి, ఏఆర్వో అనిత, ఆర్డీవో దిలీప్ చక్రవర్తి, జీవీఎంసీ అదనపు కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు


