సింహాచలం: విద్యుత్ షాక్ తగిలి, నాలుగు అంతస్తుల భవనంపై నుంచి పడి లైటింగ్స్ యజమాని, ఎలక్ట్రీషియన్ మృతి చెందిన ఘటన బుధవారం అడవివరం బీఆర్టీఎస్ ప్రధాన రహదారిపై చోటుచేసుకుంది. వర్షంలో తడుస్తూనే భర్త మృతదేహం వద్ద భార్య, బంధువులు రోదించిన తీరు స్థానికులను కలచివేసింది. పెదగదిలికి చెందిన అను లైటింగ్స్ యజమాని, ఎలక్ట్రీషియన్ దొడ్డి హనుమంతరాజు(52)కు అడవివరంలోని ఓ నూతన వాణిజ్య భవనంలో లైటింగ్ ఏర్పాటు చేసే పని అప్పగించారు. ఈ నెల 16న భవన ప్రారంభోత్సవం జరగాల్సి ఉండటంతో బుధవారం నాలుగో అంతస్తు బయటివైపు సీరియల్ లైట్లు అమర్చుతుండగా, అవి సమీపంలోని హైటెన్షన్ విద్యుత్ తీగలకు తగిలాయి. దీంతో విద్యుదాఘాతానికి గురైన హనుమంతరాజు భవనం పైనుంచి కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న ఆయన భార్య గీత, బంధువులు ఘటనా స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు. గోపాలపట్నం ఎస్ఐ రామారావు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్కు తరలించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
నాలుగో అంతస్తులో లైటింగ్ ఏర్పాటు చేస్తుండగా ప్రమాదం


