తాటిచెట్లపాలెం: రైల్ వన్ యాప్తో రైల్వే సేవలు మరింత సులువుగా చేరువ అవుతున్నాయని సౌత్ కోస్ట్ రైల్వే అధికారులు తెలిపారు. ఈ యాప్ను రైలు ప్రయాణికులు వినియోగించుకోవాలని సూచించారు. రైల్ వన్ యాప్ను ఇప్పటికే విస్తృతంగా వినియోగిస్తున్నారన్నారు. ఈ ఏడాది జూన్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, గుంతకల్ డివిజన్ల పరిధిలో ఈ యాప్ ద్వారా 13.76 లక్షల టికెట్లు బుక్ కాగా, సుమారు 70.30 లక్షల మంది సేవలు వినియోగించుకున్నారని, తద్వారా రూ.14.70 కోట్ల ఆదాయం సమకూరిందని తెలిపారు. రిజర్వ్డ్, జనరల్, ప్లాట్ఫాం టికెట్లతో పాటు రైల్వే ఎంక్వయిరీ, పీఎన్ఆర్ ఎంక్వయిరీ, రైల్ మదద్ వంటి అనేక సేవలు ఒకే యాప్లో అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్ ద్వారా యాప్ను డౌన్లోడ్ చేసుకోవచ్చన్నారు.


