వీడిన వార్డుల రిజర్వేషన్ల చిక్కుముడి | - | Sakshi
Sakshi News home page

వీడిన వార్డుల రిజర్వేషన్ల చిక్కుముడి

Oct 14 2026 11:04 AM | Updated on Oct 14 2026 11:04 AM

డాబాగార్డెన్స్‌: గ్రేటర్‌ విశాఖ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీవీఎంసీ) ఎన్నికల ప్రక్రియలో కీలక ముందడుగు పడింది. నగరంలోని 120 వార్డులకు రిజర్వేషన్లను ఖరారు చేస్తూ కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి ఎం.అభిషిక్త్‌ కిషోర్‌ మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళలు, జనరల్‌ కేటగిరీల వారీగా వార్డుల కేటాయింపులు పూర్తవడంతో ఎన్నికల బరిలో నిలవాలనుకుంటున్న ఆశావహుల్లో ఆసక్తి నెలకొంది. ఏ వార్డులో ఏ కేటగిరీకి అవకాశం దక్కిందనే స్పష్టత రావడంతో రాజకీయ పార్టీలు, నాయకులు తమ తదుపరి కార్యాచరణపై దృష్టి సారించనున్నారు.

బీసీలకు 49 వార్డులు

జీవీఎంసీ పరిధిలోని 120 వార్డుల్లో బీసీలకు అత్యధికంగా 49 స్థానాలు కేటాయించారు. వీటిలో బీసీ జనరల్‌ కేటగిరీకి 25 వార్డులు, బీసీ మహిళలకు 24 వార్డులు ఉన్నాయి. మహిళా జనరల్‌ కేటగిరీకి 31 వార్డులు కేటాయించారు. ఎస్సీలకు జనరల్‌ కేటగిరీలో ఐదు, మహిళల కేటగిరీలో ఐదు వార్డులు దక్కాయి. ఎస్టీ జనరల్‌ కేటగిరీకి ఒక వార్డును కేటాయించారు. జనరల్‌ కేటగిరీలో 29 వార్డులను ఉంచారు. మేయర్‌ పీఠాన్ని ఇప్పటికే జనరల్‌ మహిళకు కేటాయించిన విషయం తెలిసిందే.

ఆశావహుల్లో మొదలైన సమీకరణాలు

రిజర్వేషన్ల ఖరారుతో రాజకీయ పార్టీల్లో అభ్యర్థిత్వాలపై చర్చలు ఊపందుకునే అవకాశం ఉంది. గత ఎన్నికల్లో పోటీ చేసినవారు, ఈసారి బరిలో దిగాలని భావిస్తున్న కొత్త నాయకులు తమకు అనుకూలమైన వార్డులపై దృష్టి సారించనున్నారు. సామాజిక సమీకరణాలు, స్థానికంగా ఉన్న బలాబలాలు, ప్రజల్లో అభ్యర్థులకు ఉన్న ఆదరణ ఆధారంగా పార్టీలు అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేసే పరిస్థితి ఏర్పడింది.

జీవీఎంసీ ఎన్నికలకు రిజర్వేషన్ల ఖరారు

120 వార్డులకు తుది కేటాయింపులు

మేయర్‌ పీఠం

జనరల్‌ మహిళకు..

ఎన్నికల బరిలో దిగేందుకు ఆశావహుల కసరత్తు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement