సహజసిద్ధ ఇసుక తిన్నెల తొలగింపు
అనుమతులు లేకుండా జేసీబీతో పారాగ్లైడింగ్ ల్యాండింగ్ ఏర్పాట్లు
అధికారుల మౌనంపై అనుమానాలు
భవిష్యత్తులో ముంపు భయంతో స్థానికుల ఆందోళన
కొమ్మాది: ప్రముఖ పర్యాటక ప్రాంతమైన రుషికొండ తీరంలో ప్రకృతి విధ్వంసం కలకలం రేపుతోంది. సముద్రపు అలల ఉధృతిని తట్టుకుని తీర ప్రాంతాన్ని కాపాడే సహజ రక్షణ కవచాలుగా నిలిచే ఇసుక తిన్నెలను పర్యాటకం పేరిట చదును చేస్తుండటంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. పర్యాటక ఆకర్షణల అభివృద్ధి మాటున ప్రకృతి సంపదను దెబ్బతీయడంపై స్థానికులు, పర్యావరణ ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పారాగ్లైడింగ్ ల్యాండింగ్ కోసం ఓ వ్యక్తి ఎలాంటి అనుమతులు లేకుండానే మంగళవారం సాయంత్రం జేసీబీతో ఇసుక తిన్నెలను చదును చేస్తుండటం గమనార్హం. తీర ప్రాంతంలో బహిరంగంగా పనులు జరుగుతున్నా సంబంధిత అధికారులు అడ్డుకోకపోవడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రకృతి రక్షణ కవచాలపై జేసీబీ వేటు
సముద్ర తీరంలో సహజసిద్ధంగా ఏర్పడే ఇసుక తిన్నెలు అలల ఉధృతిని తగ్గించడంలో, బలమైన గాలుల ప్రభావాన్ని నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. తీర ప్రాంతానికి సహజ రక్షణ కవచాలుగా నిలుస్తాయి. అలాంటి ఇసుక తిన్నెలను యంత్రాలతో చదును చేయడం వల్ల ప్రకృతి సమతుల్యత దెబ్బతినడమే కాకుండా, సముద్రపు అలల ప్రభావం నేరుగా తీరంపై పడే ప్రమాదం ఉందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫలితంగా తీర కోత తీవ్రత పెరిగే ప్రమాదం ఉందని పేర్కొంటున్నారు.
అధికారుల కళ్లు మూసుకున్నారా?
రుషికొండ బీచ్లో జేసీబీతో ఇసుక తిన్నెలను చదును చేస్తున్నా పర్యాటక శాఖ, జీవీఎంసీ అధికారులు పట్టించుకోకపోవడం పట్ల అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇసుక తిన్నెలను ఇష్టారాజ్యంగా చదును చేస్తే భవిష్యత్తులో సముద్రపు అలలు తీర ప్రాంతంలోకి చొచ్చుకొచ్చే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికై నా అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, ఈ పనులను నిలిపివేయాలని కోరుతున్నారు. అనుమతులు లేకుండా పనులు చేపట్టినట్లు తేలితే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.


