ఐదేళ్లయినా కదలరు..నచ్చకపోతే నిలవరు! | - | Sakshi
Sakshi News home page

ఐదేళ్లయినా కదలరు..నచ్చకపోతే నిలవరు!

Oct 14 2026 11:04 AM | Updated on Oct 14 2026 11:04 AM

ఏయూలో వివాదాస్పదంగా నాన్‌–టీచింగ్‌ బదిలీలు

వీసీ జాబితాకే ఎసరు.. చక్రం తిప్పుతున్న ఆ ముగ్గురు

కులం, ముడుపుల మాయాజాలంపై ఆరోపణలు

విశాఖ విద్య: పిల్లి కళ్లు మూసుకుని పాలు తాగితే లోకమంతా చీకటే.. అన్నట్టుంది ఆంధ్ర విశ్వవిద్యాలయం(ఏయూ)లో అధికారుల తీరు. నా రూటే సెపరేటు.. అన్నట్లుగా వీసీ వ్యవహారశైలి ఉంటే.. ఇదే అదనుగా భావించిన నాన్‌–టీచింగ్‌ విభాగానికి చెందిన కొందరు ఘనులు ఇష్టారాజ్యంగా పాలనను భ్రష్టుపట్టిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నిబంధనల కంటే వ్యక్తుల నిర్ణయాలకే పెద్దపీట వేస్తున్నారా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ అడ్డగోలు వ్యవహారానికి పాలకవర్గం ఆమోదముద్ర వేయడం వెనుక మతలబేంటన్నది ఇప్పుడు ఏయూలో హాట్‌టాపిక్‌గా మారింది.

చక్రం తిప్పుతున్న ఆ ముగ్గురు!

పరిపాలనా విభాగంలో చక్రం తిప్పుతున్న ముగ్గురు కీలక వ్యక్తులతో పాటు, వీసీ, రిజిస్ట్రార్‌ పేషీల్లో ఏళ్ల తరబడి పాతుకుపోయిన కొద్దిమంది సిబ్బందే ఈ మొత్తం అక్రమాలకు సూత్రధారులుగా ఆరోపణలు వస్తున్నాయి. ఐదేళ్ల సర్వీస్‌ నిబంధనను కేవలం తమకు గిట్టని వారిని సాగనంపేందుకు మాత్రమే అస్త్రంగా మలుచుకుంటున్నారనే విమర్శలున్నాయి. కొందరిని మాత్రమే ఎంపిక చేసి బదిలీలు చేయడం, మరికొందరికి యథాస్థానంలో రెండేసి పదవులు కట్టబెట్టడం వెనుక అసలు మతలబు ఏమిటని ఉద్యోగ వర్గాలు నిలదీస్తున్నాయి.

అను‘కుల’బదిలీలు

నిబంధనలకు పాతర వేయడమే కాకుండా, యూని వర్సిటీలో కుల రాజకీయాలకు పెద్దపీట వేస్తున్నారనే ఆరోపణలున్నాయి. అడ్మినిస్ట్రేషన్‌ విభాగంలోని ఓ సూపరింటెండెంట్‌ తన సామాజిక వర్గానికి చెందిన వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్నట్లు సమాచారం. గతంలో సర్టిఫికెట్ల కుంభకోణంలో సస్పెండై, వివాదాస్పదంగా మారిన ఒక ఉద్యోగికి.. అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌ తన కులస్తుడన్న ఒకే ఒక్క కారణంతో సంపూర్ణ మద్దతునిచ్చారని ఏయూ వర్గాలు గుసగుసలుపోతున్నాయి. నిబంధనల ప్రకారం రికార్డు సెక్షన్‌లో సదరు ఉద్యోగికి ఐదేళ్ల సర్వీస్‌ పూర్తయినా, అక్కడే పదో న్నతి కల్పించి మరీ కొనసాగించారు. అదే విభాగంలో పనిచేస్తున్న ఓ దివ్యాంగ మహిళా సూపరింటెండెంట్‌ను మాత్రం కక్షగట్టినట్లు వేరే విభాగానికి బదిలీ చేశారు. దీని వెనుక కేవలం ఈ కులపక్షపాతమే కారణమని ఉద్యోగ వర్గాలు మండిపడుతున్నాయి.

వీసీ లిస్టుకే ఎసరు!

డిప్యూటీ రిజిస్ట్రార్‌ను ప్రసన్నం చేసుకున్న వారికి ఐదేళ్లు పూర్తయినా బదిలీల నుంచి మినహాయింపు లభించింది. మరికొందరైతే తాము కోరుకున్న పోస్టింగ్‌లు తెచ్చుకున్నారు. అసలు షాకింగ్‌ విషయం ఏమిటంటే.. వీసీ స్వయంగా పరిశీలించి ఆమోదించిన అధికారిక జాబితాను సైతం చివరి నిమిషంలో మార్చివేశారు! ఐదు నుంచి పదేళ్లుగా ఒకే కుర్చీకి అతుక్కుపోయిన వారిని కనీసం కదపలేదని ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కీలక విభాగాల్లో పనిచేస్తున్న సిబ్బందిని ఒకేసారి ఇష్టానుసారంగా మార్చడంతో రోజువారీ పాలనా వ్యవహారాలు పూర్తిగా స్తంభించిపోయే ప్రమాదం ఏర్పడిందని వాపోతున్నారు. ఈ బదిలీల్లో పెద్ద ఎత్తున ముడుపులు చేతులు మారినట్లు వర్సిటీ వర్గాల్లో ప్రచారం జోరుగా సాగుతోంది. ఇప్పటికై నా ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని.. ఈ బదిలీల బాగోతంపై సమగ్ర విచారణ జరిపించాలని బాధితులు డిమాండ్‌ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement