విశాఖ స్పోర్ట్స్: వినూ మన్కడ్ ట్రోఫీ ఎలైట్ మ్యాచ్‌లో కర్ణాటక అండర్–19 జట్టు చండీగఢ్ అండర్–19 జట్టుపై 100 పరుగుల తేడాతో విజయం సాధించింది. వైఎస్‌ఆర్ ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో శనివారం జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కర్ణాటక ఏడు వికెట్లకు 326 పరుగులు చేసింది. కెప్టెన్ అన్వయ్ ద్రావిడ్ (104), రోహిత్ (92), నితీష్ (79) రాణించారు. అనంతరం చండీగఢ్ జట్టు 41.4 ఓవర్లలో 226 పరుగులకు ఆలౌటైంది. మార్కండేయ (66), రూపేష్ (50) అర్ధ సెంచరీలు చేసినా ఫలితం లేకపోయింది. కర్ణాటక బౌలర్లు రతన్, తేజస్ చెరో మూడు వికెట్లు తీశారు.
అన్వయ్ ద్రావిడ్ అదుర్స్: వినూ మన్కడ్ ట్రోఫీ ఎలైట్ మ్యాచ్‌లో రాహుల్ ద్రావిడ్ తనయుడు అన్వయ్ ద్రావిడ్ ఆల్‌రౌండ్ ప్రతిభతో ఆకట్టుకున్నాడు. శనివారం విశాఖ వేదికగా జరిగిన మ్యాచ్‌లో కర్ణాటక అండర్–19 జట్టు తరఫున సెంచరీ సాధించడంతో పాటు వికెట్ల వెనుక చురుకై న ప్రదర్శనతో జట్టుకు విజయాన్ని అందించాడు.


