బీచ్‌రోడ్డు: ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌ను తక్షణమే తొలగించాలని, ఎన్నికల కమిషన్‌ను ప్రజాస్వామ్య స్వతంత్ర వ్యవస్థగా కొనసాగించాలని మేధావులు, వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు డిమాండ్ చేశాయి. శనివారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఆంధ్ర ఇంటలెక్చువల్ ఫోరం, సీపీఐ, సీపీఎం, ఇండియా బ్లాక్ పార్టీలు, ఐఎన్‌టీయూసీ ఆధ్వర్యంలో నిరాహార దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంధ్ర ఇంటలెక్చువల్ ఫోరం ఫౌండర్ ప్రెసిడెంట్ చలసాని శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యానికి ఎన్నికలే పునాది అని, రాజ్యాంగబద్ధమైన ఎన్నికల కమిషన్ నిష్పాక్షికంగా, పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాల్సిన బాధ్యత ఉందన్నారు. అయితే ఎన్నికల సంఘం వ్యవహార శైలిపై ప్రజల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయని ఆరోపించారు. ఓటర్ల జాబితాల నిర్వహణ, ఓట్ల లెక్కింపు, పోలింగ్ సమాచార భద్రత, ఎన్నికల కమిషనర్ల నియామక విధానంలో వచ్చిన మార్పులపై అనేక సందేహాలు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల అనంతరం పోలింగ్ శాతం, ఫారం–17సీ వివరాలు, ఓట్ల సంఖ్యలో తేడాలపై దేశవ్యాప్తంగా చర్చ జరిగిందన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జేవీ సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఓటర్ల జాబితాలో అవకతవకలపై ప్రశ్నలు లేవనెత్తారని తెలిపారు. కర్ణాటకలోని బెంగళూరు సెంట్రల్ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని మహదేవపుర అసెంబ్లీ సెగ్మెంట్‌లో డూప్లికేట్ ఓట్లు, అనుమానాస్పద చిరునామాలు, ఒకే ఇంట్లో పెద్ద సంఖ్యలో ఓటర్ల నమోదు వంటి అంశాలను ఆయన ప్రస్తావించారని చెప్పారు. సీపీఎం జిల్లా కార్యదర్శి ఎం. జగ్గునాయుడు మాట్లాడుతూ బీహార్‌లో చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ నేపథ్యంలో ఎన్నికల సంఘం విశ్వసనీయతపై మరోసారి చర్చ మొదలైందన్నారు. ఓటర్ల జాబితా నుంచి పెద్ద సంఖ్యలో పేర్లు తొలగించడంపై అనుమానాలు వ్యక్తమయ్యాయని పేర్కొన్నారు. ఎన్నికల కమిషన్ పారదర్శకతను నిరూపించుకోవాలని, సీఈసీ జ్ఞానేష్ కుమార్‌ను వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.


