మహారాణిపేట: వైద్య ఆరోగ్యశాఖ కాంట్రాక్టు ఉద్యోగుల నిరవధిక సమ్మె శనివారం నాలుగో రోజుకు చేరుకుంది. సమ్మెలో పాల్గొంటున్న ఉద్యోగులపై వైద్య ఆరోగ్యశాఖ చర్యలకు దిగింది. పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న 31 మంది ఉద్యోగులకు డీఎంహెచ్‌వో డాక్టర్ పి. జగదీశ్వరరావు శనివారం షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అలాగే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో పనిచేస్తున్న ముగ్గురు ఉద్యోగులకు డీసీహెచ్ సమన్వయకర్త డాక్టర్ నరేంద్రసింగ్ షోకాజ్ నోటీసులు ఇచ్చారు. రెండు రోజుల క్రితం కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఐ. వాణి కూడా కాంట్రాక్టు ఉద్యోగులకు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయడంతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని ఏపీ వైద్య ఆరోగ్యశాఖ కాంట్రాక్టు ఉద్యోగుల జేఏసీ అధ్యక్షురాలు ఆశ డిమాండ్ చేశారు. ఏళ్ల తరబడి వైద్య ఆరోగ్యశాఖలో సేవలందిస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులందరినీ తక్షణమే క్రమబద్ధీకరించాలని కోరారు. జేఏసీ కో చైర్మన్ పైడిరాజు మాట్లాడుతూ రెగ్యులరైజేషన్ ప్రక్రియ పూర్తయ్యే వరకు కాంట్రాక్టు ఉద్యోగులకు 100 శాతం గ్రాస్ వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్యశాఖ కాంట్రాక్టు ఉద్యోగుల జేఏసీ కన్వీనర్ కిశోర్, ఇతర నాయకులు ఆశ, పైడిరాజు తదితరులు పాల్గొన్నారు.
పిల్లలతోనే శిబిరాల్లో బస
సమ్మెలో పాల్గొంటున్న కాంట్రాక్టు ఉద్యోగులు కేజీహెచ్ వద్ద ఏర్పాటు చేసిన శిబిరంలోనే బస చేస్తున్నారు. నర్సులు, ఇతర సిబ్బంది తమ పిల్లలను కూడా శిబిరానికి తీసుకువచ్చి అక్కడే చదువులు, భోజనాలు, ఇతర కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. పిల్లలను వెంట ఉంచుకునే ఆందోళనను కొనసాగిస్తున్నారు.
పీహెచ్‌సీ, సీఎస్‌ిసీల్లో 34 మందికి షోకాజ్ నోటీసులు జారీ


