సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం:
విశాఖ తీరంలో చెత్తాచెదారాన్ని శుభ్రం చేసేందుకు ఉద్దేశించిన ‘బీచ్ క్లీనింగ్ యంత్రాల’ టెండర్ వ్యవహారం బేరసారాలకు కేంద్రంగా మారింది. కాంట్రాక్టర్‌తో ఒప్పందం కుదిరిన తర్వాత, టెండర్లు పిలిచిన రెండు నెలలకు తిరిగ్గా సింగిల్ టెండర్‌కే పనులు అప్పగించేందుకు రంగం సిద్ధం చేశారు. ఎన్నికల కోడ్ అమల్లోకి రాకముందే జీవీఎంసీ మెకానికల్ విభాగం అధికారులు ’రాయల్’గా దోపిడీ చేసేందుకు సిద్ధమయ్యారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రెండు రోజుల క్రితమే అధికారులకు, సదరు కాంట్రాక్టరుకు మధ్య డీల్ కుదిరినట్లు తెలుస్తోంది. టెండర్ విలువలో ఏకంగా 5 శాతం కమీషన్‌గా చెల్లించిన తర్వాతే ఫైలు ముందుకు కదిలిందని సమాచారం. ఈ టెండర్‌లో రెండు సంస్థలు పాల్గొనగా, సాంకేతిక బిడ్‌లో ఒకదానిని ఉద్దేశపూర్వకంగానే డిస్ క్వాలిఫైగా తేల్చారు. ఫలితంగా ఫైనాన్షియల్ బిడ్‌లో ఒకే సంస్థ మిగిలేలా చక్రం తిప్పారు. సాధారణంగా ఒకే సంస్థ అర్హత సాధిస్తే మళ్లీ రెండోసారి టెండర్లు పిలవాలి. కానీ ఆ నిబంధనలను పక్కనబెట్టి, సింగిల్ టెండర్‌కే జై కొడుతూ పనులు కట్టబెట్టేందుకు అనుమతి కోసం ఫైల్‌ను కమిషనర్ లాగిన్‌కు పంపారు.
8 యంత్రాలు.. రూ.14.5 కోట్లు
ప్రస్తుతం జీవీఎంసీ పరిధిలో మూడు బీచ్ క్లీనింగ్ యంత్రాలు ఉండగా, వాటి నిర్వహణను ‘పామ్‌టెక్’ సంస్థ చూస్తోంది. వీటికి అదనంగా మరో 5 యంత్రాలను కొనుగోలు చేసి, మూడేళ్ల పాటు నిర్వహించేందుకు గాను జీవీఎంసీ మెకానికల్ విభాగం రూ.14.5 కోట్లతో టెండర్లు పిలిచింది. పాత టెండర్ కాలపరిమితి జులై ఆఖరుతోనే ముగియడంతో, ఆగస్టు 1 నుంచే కొత్త సంస్థ పనులు ప్రారంభించాల్సి ఉంది. అయితే రెండు నెలలుగా టెండర్లను ఖరారు చేయకుండా కాలయాపన చేసిన అధికారులు, ఎన్నికల కోడ్ సమీపిస్తుండటంతో హడావుడి మొదలుపెట్టారు. సంబంధిత సంస్థతో బేరసారాలు కుదిరిన తర్వాతే టెండర్ ఫైలును ముందుకు కదిలించారనే విమర్శలు వస్తున్నాయి. కమిషనర్ వద్దకు రోజుకు వందల సంఖ్యలో వచ్చే ఫైళ్లలో దీనిని కూడా కలిపేసి, చూడకుండానే ఆమోదం పొందేలా స్కెచ్ వేశారు. ఒకవేళ కమిషనర్ నిలదీస్తే చెప్పేందుకు మంత్రి నారాయణ పేరును కూడా ఈ వ్యవహారంలోకి లాగినట్లు ప్రచారం జరుగుతోంది.
స్టిక్కరింగ్ మాయాజాలం..!
సదరు కాంట్రాక్ట్ సంస్థ ‘బీచ్ టెక్–2000’ పేరుతో ఉన్న వాహనానికి ‘బీచ్ టెక్–2000 ఎస్’ అని స్టిక్కరింగ్ వేసి మాయాజాలం ప్రదర్శిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
రికార్డుల్లో ఎక్కడా ’ఎస్’ మోడల్ అధికారిక తయారీ నమోదు కాలేదని తెలుస్తోంది. మరోవైపు జీవీఎంసీలోని ఏ ఇతర యంత్రాల మరమ్మతులకు ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ (ఓఅండ్‌ఎం) ఆథరైజేషన్ లెటర్ అడగడం లేదు. కానీ, మిగతా కంపెనీలను రేసు నుంచి తప్పించేందుకు ఈ టెండర్‌లో నిబంధనలకు విరుద్ధంగా ఓఅండ్‌ఎం ఆథరైజేషన్ నిబంధనను చేర్చారు. తీరా ఇప్పుడు పనులు దక్కించుకుంటున్న సంస్థ సమర్పించిన ఓఅండ్‌ఎం పత్రాల్లోనూ తీవ్ర అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇక టెండర్ నిబంధనల ప్రకారం రోజుకు ఉదయం 4 గంటలు, సాయంత్రం 4 గంటల చొప్పున మొత్తం 8 గంటలు బీచ్‌ను శుభ్రం చేయాలి. కానీ ఏ రోజూ పూర్తిస్థాయిలో యంత్రాలను తిప్పకుండానే, చేసినట్లు రికార్డులు సృష్టించి బిల్లులు మంజూరు చేసుకుంటున్నారని తెలుస్తోంది.
లోతుగా విచారణ జరుపుతాం
బీచ్ క్లీనింగ్ యంత్రాల టెండర్ వ్యవహారంపై లోతుగా విచారణ జరుపుతాం. టెండర్ నిబంధనలు, పాల్గొన్న సంస్థ సమర్పించిన పత్రాలన్నింటినీ సమగ్రంగా పరిశీలించిన తర్వాతే తగిన నిర్ణయం తీసుకుంటాం. హడావుడిగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోం. అవసరమైతే నిబంధనల ప్రకారం మళ్లీ కొత్తగా టెండర్లు పిలుస్తాం.
– కేతన్ గార్గ్, జీవీఎంసీ కమిషనర్
‘రాయల్’గా దోపిడీకి స్కెచ్!


