మహారాణిపేట: స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం చేసిన ఓటర్ల జాబితాల్లో లోపాలు వెలుగుచూస్తున్నాయి. జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గం (జెడ్‌పీటీసీ), మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గం (ఎంపీటీసీ) ఎన్నికల కోసం రూపొందించిన జాబితాల్లో పలువురి పేర్లు లేకపోవడం, పేర్లు, ఇంటి పేర్లు, వయస్సు వివరాల్లో తప్పులు నమోదవడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల నిర్వహణలో భాగంగా అధికారులు ఓటర్ల జాబితాలు, పోలింగ్ కేంద్రాలను ఖరారు చేశారు. అయితే జనవరి 31 తర్వాత కొత్తగా ఓటర్లుగా నమోదైన పలువురి పేర్లు తాజా జాబితాల్లో కనిపించకపోవడంతో ఆందోళన నెలకొంది.
కొత్త ఓటర్లకు నిరాశ : ఈ ఏడాది జనవరి 31 నాటికి ఉమ్మడి విశాఖ పరిధిలో 18,95,962 మంది ఓటర్లు ఉన్నారు. అనంతరం తొమ్మిది నెలల్లో పెద్ద సంఖ్యలో కొత్త ఓటర్లు నమోదయ్యారు. కానీ స్థానిక ఎన్నికల జాబితాల్లో వీరిలో చాలామంది పేర్లు లేకపోవడంతో తమ ఓటు హక్కు కోల్పోతామేమోనని ఆందోళన చెందుతున్నారు.
వివరాల్లోనూ తప్పులు : ఓటర్ల జాబితాల్లో పేర్లు, ఇంటి పేర్లు, వయస్సు వివరాలు తప్పుగా నమోదైనట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. కొన్నిచోట్ల మరణించిన వారి పేర్లు కూడా కొనసాగుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. జాబితాలను మరోసారి క్షుణ్ణంగా పరిశీలించి లోపాలను సరిచేయాలని ప్రజలు కోరుతున్నారు.
పోలింగ్ కేంద్రాల్లో మార్పులు : ఓటర్ల జాబితాలతో పాటు పోలింగ్ కేంద్రాల సంఖ్యలోనూ మార్పులు చోటుచేసుకున్నాయి. విశాఖ జిల్లాలోని నాలుగు మండలాలకు తొలుత 200 కేంద్రాలను ప్రతిపాదించగా, తుది జాబితాలో వాటి సంఖ్య 203కు చేరింది. అనకాపల్లి జిల్లాలో 1,536 నుంచి 1,530కు, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 616 నుంచి 617కు మారింది.
జాబితా తయారీపై ఫిర్యాదులు : ఓటర్ల జాబితా తయారీ ప్రక్రియలో నిబంధనలు పాటించలేదన్న ఫిర్యాదులు వస్తున్నాయి. స్థానిక స్థాయిలో మార్పులు, చేర్పులపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్పెషల్ సమ్మరీ రివిజన్‌లో తొలగించిన పేర్లనే పరిగణనలోకి తీసుకున్నారన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. నిబంధనల ప్రకారం రెవెన్యూ అధికారులు రూపొందించిన జాబితాలను పరిశీలించి ఖరారు చేయాల్సి ఉండగా, క్షేత్రస్థాయిలో జోక్యాలు జరిగాయన్న విమర్శలు ఉన్నాయి.
నర్సీపట్నం పరిధిలో ఎక్కువ అభ్యంతరాలు : నర్సీపట్నం నియోజకవర్గ పరిధిలో ఓటర్ల జాబితాపై ఎక్కువగా అభ్యంతరాలు వస్తున్నాయి. నాతవరం మండలంలోని పలు పంచాయతీల్లో పేర్ల నమోదు, తొలగింపుల్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు ఉన్నాయి. నక్కపల్లి, పాయకరావుపేట, ఎస్.రాయవరం, ఎలమంచిలి, కోటవురట్ల, రావికమతం, చోడవరం, మాడుగుల మండలాల్లోనూ ఇలాంటి ఫిర్యాదులు వచ్చినట్లు సమాచారం.
39 మండలాలు.. 2,350 పోలింగ్ కేంద్రాలు
మూడు జిల్లాల పరిధిలోని 39 మండలాల్లో 652 ఎంపీటీసీ స్థానా లకు ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం 2,350 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేశారు. విశాఖ జిల్లాలో భీమిలి, ఆనందపురం, పద్మనాభం, పెందుర్తి మండలాల్లో 53 ఎంపీటీసీ స్థానాలకు 203 కేంద్రాలు, అనకాపల్లి జిల్లాలో 427 స్థానాలకు 1,530 కేంద్రాలు, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 172 స్థానాలకు 617 కేంద్రాలు ఏర్పాటు చేశారు. స్థానిక ఎన్నికల్లో కీలకమైన ఓటర్ల జాబితాలో ఎలాంటి లోపాలు లేకుండా తుది పరిశీలన చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
జిల్లా పంచాయతీలు ఎంపీటీసీలు జెడ్‌పీటీసీలు పోలింగ్ పురుషులు సీ్త్రలు ఇతరులు మొత్తం
స్టేషన్లు ఓటర్లు
విశాఖ 79 53 4 203 79,630 82,777 00 1,62,407
అనకాపల్లి 642 427 24 1530 6,03,286 6,31,787 17 12,35,090
ఏఎస్‌ఆర్ 244 172 11 617 2,41,445 2,56,997 23 4.98,465
మొత్తం 965 652 39 2350 9,24,361 9,71,561 40 18,95,962


