చైన్‌ స్నాచింగ్‌ ముఠా అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

చైన్‌ స్నాచింగ్‌ ముఠా అరెస్ట్‌

Oct 7 2026 12:05 AM | Updated on Oct 7 2026 12:05 AM

అనకాపల్లి: చైన్‌ స్నాచింగ్‌లకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 4.5 తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పట్టణ క్రైం ఎస్‌ఐ అల్లు వెంకటేశ్వరరావు మంగళవారం తెలిపారు. సుంకరమెట్ట జంక్షన్‌ వద్ద వాహనాల తనిఖీల్లో అనుమానాస్పదంగా కనిపించిన ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారించగా చోరీల విషయం వెలుగులోకి వచ్చిందన్నారు. రాజస్థాన్‌లోని నాగౌర్‌ జిల్లా పంచవటి గ్రామానికి చెందిన, ప్రస్తుతం మధురవాడ చంద్రంపాలెంలో నివాసముంటున్న మహేందర్‌ సింగ్‌ అలియాస్‌ మహేంద్ర, కొమ్మాది జంక్షన్‌ శ్రీకృష్ణ గాయత్రి వైభవ్‌నగర్‌కు చెందిన మండ్రు లతారత్నాకర్‌ (52)ను అరెస్టు చేసినట్లు తెలిపారు. మహేందర్‌ సింగ్‌ గతంలో సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో హోంగార్డుగా పనిచేశాడని, అనంతరం నేరాల బాట పట్టాడని చెప్పారు. గతంలో హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో సుమారు 36 బంగారు గొలుసుల చోరీలకు పాల్పడి జైలుశిక్ష అనుభవించాడన్నారు. జైలు నుంచి విడుదలైన అనంతరం మధురవాడలో ఉంటూ రాపిడో బైక్‌ నడుపుతున్న మహేంద్ర.. విశాఖ, అనకాపల్లి, శ్రీకాకుళం, రాజమండ్రి, కాకినాడ, నెల్లూరు తదితర ప్రాంతాల్లో ఒంటరిగా వెళ్లే మహిళలను లక్ష్యంగా చేసుకుని చైన్‌ స్నాచింగ్‌లకు పాల్పడేవాడని ఎస్‌ఐ తెలిపారు. చోరీ చేసిన బంగారాన్ని లతారత్నాకర్‌కు ఇచ్చి, ఆమె పరిచయమున్న నగల దుకాణాల్లో విక్రయించి సొమ్మును పంచుకునేవారని వివరించారు. నిందితులను కోర్టులో హాజరుపర్చగా 14 రోజుల రిమాండ్‌ విధించినట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement