25 రోజులుగా స్తంభించిన
డీఎల్ రెన్యువల్ ప్రక్రియ
విశాఖ జిల్లాలోనే 25 వేలకు పైగా
దరఖాస్తులు పెండింగ్
‘డెమోగ్రాఫిక్ ఎర్రర్’తో
స్కూల్ బస్సు డ్రైవర్ల అవస్థలు
ప్రమాదం జరిగితే ఇన్సూరెన్స్‌పై
వాహనదారుల తీవ్ర ఆందోళన
సాక్షి, విశాఖపట్నం: డ్రైవింగ్ లైసెన్స్ (డీఎల్) రెన్యువల్ కోసం దరఖాస్తు చేసుకుంటున్న వాహనదారులకు ‘సారథి పరివార్’ యాప్ చుక్కలు చూపిస్తోంది. గత 25 రోజులుగా ఈ యాప్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో పునరుద్ధరణ ప్రక్రియ ఎక్కడికక్కడ నిలిచిపోయింది. గడువు ముగిసిన లైసెన్సులతోనే డ్రైవర్లు భయం భయంగా వాహనాలు నడపాల్సిన దుస్థితి దాపురించింది. ఒకవైపు సిస్టమ్ మోకాలడ్డటం, మరోవైపు అధికారుల ఉదాసీనత వాహనదారులకు శాపంగా మారాయి.
పెండింగ్ కొండలా..
జిల్లాలో రవాణా శాఖ పరిధిలో రోజుకు సగటున వెయ్యి వరకు డీఎల్ రెన్యువల్ దరఖాస్తులు నమోదవుతుంటాయి. సారథి యాప్ సరిగ్గా పనిచేయకపోవడంతో ప్రక్రియ పూర్తిగా మందగించి, జిల్లాలో పెండింగ్ దరఖాస్తుల సంఖ్య ఏకంగా 25 వేలు దాటింది. గడువు ముగిసేలోపే ముందస్తుగా అప్లై చేసుకున్నప్పటికీ, పోర్టల్‌లో అప్‌డేట్ కాకపోవడంతో వాహనదారులకు నిరాశే మిగులుతోంది.
‘డెమోగ్రాఫిక్ ఎర్రర్’తో సతమతం
ఆన్‌లైన్‌లో వంద దరఖాస్తులను ప్రాసెస్ చేయడానికి ప్రయత్నిస్తే, అందులో నాలుగైదు కూడా పూర్తికావడం లేదు. అప్లికేషన్ సమర్పించే సమయంలో స్క్రీన్‌పై ‘డెమోగ్రాఫిక్ ఎర్రర్’ అని చూపిస్తూ ప్రక్రియ ఆగిపోతోంది. ఏఐ ఆధారంగా జారీ చేసే ఎల్‌ఎల్‌ఆర్, కొత్త డ్రైవింగ్ లైసెన్సుల జారీ వేగంగానే జరుగుతున్నా.. పాత లైసెన్సుల రెన్యువల్ వద్దే ఈ చిక్కులు వస్తున్నాయి. ప్రధానంగా ఆధార్ కార్డులోని పేరు, ఇంటిపేరు వరుస క్రమానికి, డ్రైవింగ్ లైసెన్స్‌లోని వివరాలకు మధ్య చిన్నపాటి తేడా ఉన్నా సిస్టమ్ తిరస్కరిస్తోంది. ఈ వివరాల సవరణ కోసం ఆర్టీఓ కార్యాలయాల చుట్టూ కాళ్లు అరిగేలా తిరిగినా ఫలితం ఉండటం లేదు.
స్కూల్ బస్సు డ్రైవర్ల ఇక్కట్లు
ఈ సాంకేతిక లోపం వల్ల ముఖ్యంగా స్కూల్ బస్సు డ్రైవర్లు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. నిత్యం వందలాది మంది విద్యార్థులను సురక్షితంగా చేర్చాల్సిన తమకు లైసెన్స్ రెన్యువల్ కాకపోవడం మానసిక వేదన కలిగిస్తోందని వాపోతున్నారు. ఇటు పాఠశాల యాజమాన్యాల ఒత్తిడి, అటు ఆర్టీఓ ఆఫీసుల్లో పనులు కాకపోవడంతో నానా అవస్థలు పడుతున్నారు.
ప్రమాదం జరిగితే ఇన్సూరెన్స్ రానట్టే!
లైసెన్స్ గడువు ముగిసిన తర్వాత రోడ్డుపై వాహనం నడుపుతూ ప్రమాదానికి గురైతే పరిస్థితి దారుణంగా మారుతుంది. మోటార్ వాహనాల నిబంధనల ప్రకారం చెల్లుబాటు అయ్యే డీఎల్ లేకపోతే ప్రమాద బీమా (ఇన్సూరెన్స్) కింద ఒక్క రూపాయి కూడా దక్కదు. సాంకేతిక లోపంతో ప్రభుత్వ పరంగా జాప్యం జరుగుతున్నందున, దీనివల్ల తమకు నష్టం జరగకుండా ప్రత్యామ్నాయ మార్గాలు చూడాలని బాధితులు కోరుతున్నారు.
నామమాత్రపు స్పందన : బాధితులు ఆర్టీఓ కార్యాలయాలకు వెళ్లి విన్నవించుకుంటున్నా అధికారులు నామమాత్రంగానే ఫిర్యాదులు తీసుకుంటున్నారు. ‘ఇది కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ‘ఢిల్లీ యాప్’. ప్రస్తుతం సర్వర్లు, సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ జరుగుతోంది‘ అంటూ దాటవేసే ప్రయత్నం చేస్తున్నారే తప్ప, సమస్య ఎప్పటికి పరిష్కారమవుతుందో స్పష్టత ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ప్రమాదం జరిగితే రోడ్డున పడాల్సిందే..
డ్రైవర్లు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని వాహనాలు నడుపుతున్నారు. 25 రోజులుగా రెన్యువల్స్ కాకపోవడంతో దురదృష్టవశాత్తూ ఏదైనా ప్రమాదం జరిగితే ఇన్సూరెన్స్ క్లెయిమ్ కాక డ్రైవర్ల కుటుంబాలు అగమ్యగోచరంగా మారే ప్రమాదం ఉంది. తక్షణమే ఈ లోపాన్ని సరిచేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.
– ఎం.వి.రెడ్డి, వాహనదారుడు
సమస్య పరిష్కారానికి చర్యలు
యాప్‌లో తలెత్తిన సాంకేతిక లోపాలను కేంద్ర రవాణా శాఖ దృష్టికి తీసుకెళ్లాం. ఆధార్‌లోని పేరు, డ్రైవింగ్ లైసెన్స్‌లోని పేరు అమరికలో తేడాలు ఉండటం వల్లే ’డెమోగ్రాఫిక్ ఎర్రర్’ వస్తోంది. పేరు, ఇంటిపేరు క్రమం ముందూ వెనుక ఉన్నప్పటికీ ఆటోమేటిక్‌గా సిస్టమ్ స్వీకరించేలా యాప్‌ను అప్‌డేట్ చేస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే రెన్యువల్స్ సజావుగా సాగుతాయి.
– శ్రీనివాస్, జిల్లా రవాణా అధికారి


