మహారాణిపేట: వైద్య ఆరోగ్యశాఖ కాంట్రాక్టు ఉద్యోగులు తమ డిమాండ్ల సాధన కోసం బుధవారం నుంచి నిరవధిక సమ్మెకు దిగుతున్నారు. గత రెండు నెలలుగా ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడంతో అత్యవసర సేవలతో సహా విధులు బహిష్కరించాలని జేఏసీ నిర్ణయించింది. దీంతో కేజీహెచ్, విమ్స్, పలు బోధనాస్పత్రులు, పీహెచ్‌సీలు, సీహెచ్‌సీల్లో వైద్య సేవలపై ప్రభావం పడనుంది. విశాఖలో 910 మంది కాంట్రాక్టు ఉద్యోగులు సమ్మెలో పాల్గొంటున్నారు. వీరిలో 740 మంది నర్సులు, 82 మంది ల్యాబ్ టెక్నీషియన్లు, 88 మంది ఇతర సిబ్బంది ఉన్నారు. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని, అప్పటివరకు 100 శాతం గ్రాస్ వేతనం చెల్లించాలని, విధి నిర్వహణలో మృతిచెందిన ఉద్యోగుల కుటుంబాలకు రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని జేఏసీ డిమాండ్ చేస్తోంది. హెల్త్‌కార్డులు, పూర్తి వేతనంతో కూడిన అనారోగ్య సెలవులు, రిక్వెస్ట్, మ్యూచువల్ ట్రాన్స్‌ఫర్ల సౌకర్యం కల్పించాలని కోరుతోంది. సమ్మెకు మద్దతుగా జేఏసీ ఆధ్వర్యంలో మంగళవారం కేజీహెచ్ నుంచి ఆంధ్రా మెడికల్ కాలేజీ మీదుగా నిరసన ప్రదర్శన నిర్వహించారు. తమ డిమాండ్లు పరిష్కరించే వరకు ఆందోళన కొనసాగుతుందని జేఏసీ చైర్మన్ ఆశ, కన్వీనర్ కిశోర్‌రావు, కో–చైర్మన్ పైడిరాజు తెలిపారు.
కేజీహెచ్, బోధనాస్పత్రులు, పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలపై ప్రభావం


