కూటమి పాలనపై ప్రజా పోరుకు
భీమిలి గడ్డ నుంచి సమరశంఖం
భీమిలి ఆత్మీయ సమావేశంలో
బొత్స, కన్నబాబు గర్జన
నియోజకవర్గ సమన్వయకర్తగా
బాధ్యతలు స్వీకరించిన బొత్స అనూష
సాక్షి, విశాఖపట్నం: కూటమి ప్రభుత్వ దౌర్జన్యాలు, బెదిరింపులను తిప్పికొడుతూ క్షేత్రస్థాయిలో ప్రజాపోరాటాలకు వైఎస్సార్‌సీపీ సమరశంఖం పూరించింది. వైఎస్సార్‌సీపీ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని, కసిని నింపుతూ భీమిలి గడ్డ వేదికగా ఆ పార్టీ నేతలు సింహ గర్జన చేశారు. వ్యక్తిగత స్వార్థాన్ని పక్కనపెట్టి ప్రతీ నాయకుడు, కార్యకర్త ప్రజల పక్షాన నిలబడాలని శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ, పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు పిలుపునిచ్చారు. ఎలాంటి పరిస్థితులైనా ధైర్యంగా ఎదుర్కొందామని, ప్రతీ కార్యకర్తకూ కొండంత అండగా వైఎస్ జగన్, పార్టీ అగ్రనాయకత్వం ఉంటుందని కొండంత భరోసానిచ్చారు. సోమవారం ఎండాడలోని పార్టీ జిల్లా కార్యాలయంలో వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు అధ్యక్షతన భీమిలి నియోజకవర్గ ఆత్మీయ సమావేశం జనసందోహం మధ్య అంబరాన్నంటింది. ఈ సందర్భంగా భీమిలి నియోజకవర్గ సమన్వయకర్తగా డాక్టర్ బొత్స అనూష బాధ్యతలు స్వీకరించగా కార్యకర్తలు ఈలలు, కేరింతలతో ఘనస్వాగతం పలికారు. తొలుత పార్టీ జెండాను ఆవిష్కరించి, వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
నాయకులు మారినా కేడరే మా బలం
శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ భీమిలిలో పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్త తమ కుటుంబ సభ్యుడేనని ఉద్ఘాటించారు. నాయకులు వస్తుంటారు, పోతుంటారు కానీ జెండా పట్టిన కార్యకర్త, పార్టీయే శాశ్వతమని స్పష్టం చేశారు. స్వార్థంతో కొందరు వీడిపోయినా పార్టీకి వచ్చే నష్టమేమీ లేదన్నారు. భీమిలిలో కనీసం తాగడానికి నీళ్లు కూడా ఇవ్వలేని చేతకాని పాలన సాగుతోందని, ప్రభుత్వ వైఫల్యాలపై సోషల్ మీడియాను ఆయుధంగా చేసుకుని చెలరేగిపోవాలని సూచించారు. ఏపీకి మళ్లీ వైఎస్ జగన్‌ను సీఎం చేయడం, భీమిలిలో అనూషను గెలిపించడమే లక్ష్యంగా కదం తొక్కాలని పిలుపునిచ్చారు.
జగన్‌ను భయపెట్టే నాయకుడు పుట్టలేదు
రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు మాట్లాడుతూ వైఎస్ జగన్‌ను రాజకీయంగా భయపెట్టడం ఎవరి తరం కాదని తేల్చి చెప్పారు. విశాఖను కేంద్రంగా చేసుకుని కూటమి ప్రభుత్వం యథేచ్ఛగా దోపిడీకి తెగబడుతోందని, రూ.5 వేల కోట్ల విలువైన గీతం భూములతో పాటు ఎకరం భూమిని 99 పైసలకే కార్పొరేట్లకు అప్పనంగా కట్టబెడుతున్నారని మండిపడ్డారు. పేదవాడికి సెంటు స్థలం ఇవ్వని ప్రభుత్వం, సింహాచలం, పంచదార్ల కొండలను తవ్వేస్తూ వినాశనం సృష్టిస్తోందని ధ్వజమెత్తారు.
భీమిలితో మాది మూడు తరాల అనుబంధం
భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ బొత్స అనూష మాట్లాడుతూ భీమిలితో తమ కుటుంబానికి మూడు తరాల దృఢమైన బంధం ఉందన్నారు. నాయకురాలిగా కాకుండా కుటుంబంలో ఒక సభ్యురాలిగా అందరినీ కలుపుకుని పోతానని చెప్పారు. జగనన్న నమ్మకాన్ని నిలబెడుతూ, కార్యకర్తలకు అండగా ఉంటూ కూటమి ప్రభుత్వానికి చరమగీతం పాడే వరకు విశ్రాంతి లేకుండా పోరాడతానని ధీమా వ్యక్తం చేశారు.
● పార్టీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు మాట్లాడుతూ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆశీస్సులతో, బొత్స అనూష నాయకత్వంలో భీమిలిలో పార్టీని మరింత బలోపేతం చేస్తూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేయాలన్నారు.
● మాజీ ఎంపీ బొత్స ఝాన్సీలక్ష్మి మాట్లాడుతూ పార్టీ కోసం కష్టపడే ప్రతీ కార్యకర్తకూ తమ కుటుంబం అండగా ఉంటుందన్నారు. పదవులు అనుభవించి పార్టీ వీడే నాయకులకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారని స్పష్టం చేశారు.
● మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు మాట్లాడుతూ రాజకీయాల్లో ’బొత్స’ అనేది ఒక పవర్‌ఫుల్ బ్రాండ్ అని, చిన్న వయసులోనే బాధ్యతలు చేపట్టిన అనూషకు అందరూ అండగా నిలిచి భీమిలిలో జెండా ఎగరేయాలన్నారు.
● మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ మాట్లాడుతూ జగన్ అంటే నమ్మకం, చంద్రబాబు అంటే అమ్మకమని విమర్శించారు. కొండలను తవ్వేస్తున్న కూటమి ప్రభుత్వానికి వైఎస్ జగన్ జైత్రయాత్రతో అంతిమ యాత్ర ప్రారంభం కావడం ఖాయమన్నారు.
● మాజీ డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణి మాట్లాడుతూ యువతకు వైఎస్ జగన్ పెద్దపీట వేస్తున్నారన్నారు. అనూష బలమైన నాయకురాలిగా ఎదగాలని ఆకాంక్షించారు.
● ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ ఒక నిరంతర ప్రవాహమని, ఒకరిద్దరు నాయకులు వెళ్లినా వారి స్థానంలో వందల మందిని తయారుచేసే మహాశక్తి వైఎస్ జగన్‌కు ఉందని స్పష్టం చేశారు.
సమావేశంలో ఎమ్మెల్సీ కుంబా రవిబాబు, విజయనగరం, అనకాపల్లి, పార్వతీపురం మన్యం జిల్లాల పార్టీ అధ్యక్షులు బెల్లాన చంద్రశేఖర్, బొడ్డేటి ప్రసాద్, పరీక్షిత్ రాజు, మాజీ ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు కరణం ధర్మశ్రీ, కంబాల జోగులు, అదీప్‌రాజ్, బొత్స అప్పులనర్సయ్య, శోభా హైమావతి, చింతలపూడి వెంకటరామయ్య, తిప్పల గురుమూర్తిరెడ్డి, తిప్పల దేవన్‌రెడ్డి, మొల్లి అప్పారావు, నియోజకవర్గ పరిశీలకుడు తైనాల విజయ్‌కుమార్, మాజీ మేయర్ హరివెంకట కుమారి, జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ సుభద్ర, మహిళా విభాగం అధ్యక్షురాలు పేడాడ రమణకుమారి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


