సాక్షి, విశాఖపట్నం: దేశ సుస్థిర అభివృద్ధి, ప్రజలకు స్వచ్ఛ ఇంధనం అందించేందుకు భారత ప్రమాణాల బ్యూరో(బీఐఎస్) నిరంతరం కట్టుబడి ఉంటుందని సంస్థ రీజనల్ డైరెక్టర్ అండ్ హెడ్ సైంటిస్ట్–ఈ ప్రేమ్ సజని స్పష్టం చేశారు. బీఐఎస్ ఆధ్వర్యంలో నగరంలోని ఓ హోటల్‌లో బీఐఎస్ ‘స్టాండర్డ్స్ కాంక్లేవ్’సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రేమ్ సజని మాట్లాడుతూ ఈ నెల 14న జరగనున్న ప్రపంచ ప్రమాణాల దినోత్సవం (మానక్ మహోత్సవ్) వేడుకలకు సన్నాహకంగా ఈ సదస్సు నిర్వహించామన్నారు. నాణ్యత ప్రమాణాలపై ప్రజలందరూ అవగాహన కలిగి ఉండాలని పిలుపునిచ్చారు. ప్రతి కొనుగోలుదారు ఫోన్‌లో బీఐఎస్ కేర్ యాప్ ఉంటే.. మీరు కొనే వస్తువులు నాణ్యమైనవా? కాదా? అనేది సులువుగా తెలుసుకునేందుకు వీలుంటుందని సూచించారు. విద్యార్థి దశనుంచే దీనిపై అవగాహన కల్పించేందుకు దేశ వ్యాప్తంగా బీఐఎస్ క్లబ్స్‌ను విద్యాసంస్థల్లో ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గోల్స్–7 థీమ్‌తో ఈసారి మానక్ మహోత్సవ్ నిర్వహిస్తున్నామన్నారు. ఏయూ ప్రొఫెస ర్ డా.శ్రీదేవి వేలూరు, గ్లోబల్ ఎన్‌ఎస్‌జీ గ్రూప్ ఇండియా ప్రతినిధి వెంకట కిరణ్ సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించడంలో ప్రమాణాల పాత్రపై వివరించారు. ఈ సందర్భంగా స్టాండర్డ్స్ క్లబ్స్ విద్యార్థులు దైనందిన జీవితంలో ప్రమాణాల ఆవశ్యకతను తెలియజేసేలా ఏర్పాటు చేసిన పోస్టర్లు, చార్ట్‌లు, విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. కార్యక్రమంలో పరిశ్రమల ప్రతినిధులు, విద్యావేత్తలు, విద్యార్థులు పాల్గొన్నారు.
బీఐఎస్ డైరెక్టర్ అండ్ హెడ్ సైంటిస్ట్ సజని


