నకిలీ పత్రాలతో స్థలం కాజేసే యత్నం | - | Sakshi
Sakshi News home page

నకిలీ పత్రాలతో స్థలం కాజేసే యత్నం

Oct 6 2026 1:12 AM | Updated on Oct 6 2026 1:12 AM

పీఎం పాలెం: బతికున్న వ్యక్తిని మృతుడిగా చూపిస్తూ నకిలీ మరణ ధ్రువపత్రాలు, ఆధార్‌ కార్డులు సృష్టించి అతడి భార్య పేరిట ఉన్న స్థలాన్ని కాజేసి విక్రయించేందుకు యత్నించిన ముఠాను పీఎం పాలెం పోలీసులు అరెస్ట్‌ చేశారు. ప్రధాన నిందితుడితో పాటు ఎనిమిది మందిని రిమాండ్‌కు తరలించగా.. మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. ఈ వివరాలను నగర డీసీపీ–1 వీఎన్‌ మణికంఠ చందోలు సోమవారం వెల్లడించారు. పోలీసుల వివరాల మేరకు.. పెదగంట్యాడకు చెందిన విశ్రాంత పోర్టు ఉద్యోగి పెన్నాం చంద్రబాబు 2004లో శివశక్తి లేఅవుట్‌లో 200 గజాల స్థలాన్ని భార్య రమాదేవి పేరిట కొనుగోలు చేశారు. రమాదేవి 2023లో మృతి చెందగా.. ఈ ఏడాది మేలో స్థలం పరిశీలించేందుకు వెళ్లిన చంద్రబాబుకు అది జీపీఏ ద్వారా మరో వ్యక్తి పేరున బదిలీ అయినట్లు తెలిసింది. దర్యాప్తులో చంద్రబాబును 2009లోనే మృతుడిగా చూపిస్తూ, ఆయన భార్య 2013లో మృతి చెందినట్లు నకిలీ ధ్రువపత్రాలు సృష్టించినట్లు తేలింది. వారి పేర్లతో నకిలీ ఆధార్‌లు తయారు చేసి, నైనాల కీర్తికను చంద్రబాబు కుమార్తెగా చూ పించి స్థలాన్ని జీపీఏ ద్వారా బదిలీ చేసినట్లు పోలీసులు గుర్తించారు. స్థలాన్ని రూ.80 లక్షలకు విక్రయించేందుకు ఒప్పందం చేసుకుని, రూ.15 లక్షలు అడ్వాన్స్‌గా తీసుకున్నట్లు దర్యాప్తులో తేలింది. ఈ నెల 3న మధురవాడ సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయం వద్ద విక్రయానికి యత్నిస్తుండగా నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నక్కెళ్ల రామకృష్ణ శివప్రసాద్‌, అలమండ కుమార్‌, రేగుల గెడ్డ లక్ష్మణరావు, మాతి దుర్గా మహేష్‌, నైనాల కీర్తిక, పప్పల మణికుమార్‌, మంతిన సురేష్‌కుమార్‌ రాజు, గోకు సాయికిరణ్‌లను అరెస్ట్‌ చేశారు. విత్తనాల రత్నప్రసాద్‌ పరారీలో ఉన్నట్లు డీసీపీ తెలిపారు. నగరంలోని ఖాళీ స్థలాలను గుర్తించి నకిలీ పత్రాలతో విక్రయిస్తున్నట్లు విచారణలో వెల్లడైందన్నారు.

ఎనిమిది మంది అరెస్ట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement