పురుగులన్నమే పరమాన్నం | - | Sakshi
Sakshi News home page

పురుగులన్నమే పరమాన్నం

Oct 6 2026 1:12 AM | Updated on Oct 6 2026 1:12 AM

● మారని ఏయూ హాస్టళ్ల తీరు ● ఉమెన్స్‌ హాస్టల్‌లో కూరలో పురుగులు ● సోషల్‌మీడియాలో హల్‌చల్‌ ● మండిపడుతున్న విద్యార్థి సంఘాలు ●

విశాఖ విద్య: ఆంధ్ర విశ్వవిద్యాలయం హాస్టళ్ల నిర్వహణ తీరుపై మరోసారి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నా, ఎప్పటికప్పుడు సూచనలు చేస్తున్నా ఆహార నాణ్యతలో మాత్రం మార్పు కనిపించడం లేదని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లక్షల్లో ఫీజులు చెల్లిస్తున్నా నాణ్యమైన భోజనం అందడం లేదని వాపోతున్నారు. మహారాణిపేటలోని ఏయూ ఉమెన్స్‌ హాస్టల్‌లో బెండకాయ కూరలో పురుగులు ఉన్న దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడం కలకలం రేపింది. కూరగాయల నాణ్యతపై విద్యార్థినులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇంత నిర్లక్ష్యంగా ఆహారం తయారు చేయడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మేట్రిన్‌ల తీరుపై అసంతృప్తి

హాస్టల్‌ మేట్రిన్‌ల వ్యవహారశైలిపైనా విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సమస్యలను ప్రస్తావించినప్పుడు సానుకూలంగా స్పందించడం లేదని, దురుసుగా సమాధానాలు ఇస్తున్నారని ఆరోపిస్తున్నారు. భోజన నాణ్యతపై ప్రశ్నించినా ఇబ్బందులు ఎదురవుతున్నాయని వాపోతున్నారు.

గతంలోనూ

మెస్‌లపై ఆందోళనలు

ఏయూ మెస్‌లలో ఆహార నాణ్యతపై గతంలోనూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. అప్పట్లో వైస్‌ చాన్సలర్‌ స్వయంగా జోక్యం చేసుకుని సమస్యలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి నిరంతర పర్యవేక్షణకు ఆదేశించారు. తాజాగా ఉమెన్స్‌ హాస్టల్‌ వ్యవహారంతో మరోసారి భోజన సౌకర్యాలు, ఆహార నాణ్యతపై క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టాలని విద్యార్థినులు కోరుతున్నారు.

ఉన్నతాధికారులు దృష్టి పెట్టాలి

హాస్టళ్ల నిర్వహణపై ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలి. విద్యార్థినుల ఆరోగ్యంతో ముడిపడిన ఆహార నాణ్యత విషయంలో నిర్లక్ష్యం తగదు. విద్యార్థుల అభిప్రాయాలను ఎప్పటికప్పుడు తెలుసుకుని సమస్యలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి. – లక్ష్మి, పీడీఎస్‌ఓ నేత

ఎక్కడ తప్పు జరిగిందో

తెలుసుకుంటాం

కూరగాయలు, ఆకుకూరల కొనుగోలు విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టాం. సంబంధిత కాంట్రాక్టర్‌ పంపిణీ చేసిన కాయగూరల నాణ్యత వల్లే ఇది జరిగిందా లేక ఎక్కడ తప్పు జరిగింది అనేది పరిశీలిస్తాం. హాస్టల్‌ పరువు తీయడానికి ఎవరైనా ఇలా చేశారా అనేది కూడా పరిశీలిస్తాం. – ప్రొఫెసర్‌ ఆశాలత,

చీఫ్‌ వార్డెన్‌, ఉమెన్స్‌ హాస్టల్‌

విద్యార్థినుల ఆరోగ్యం పట్టదా

ఇలాంటి నాణ్యత లేని భోజనం వల్ల విద్యార్థినుల ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉంది. ఫిర్యాదులు చేసినా మార్పు రాకపోవడం బాధాకరం. వేలల్లో ఫీజులు తీసుకుంటున్నప్పుడు కనీసం నాణ్యమైన ఆహారం అందించే బాధ్యత అధికారులపై ఉంది. పదేపదే ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలి.

– కుసుమ, ఎస్‌ఎఫ్‌ఐ నేత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement