1,600 మంది ఉద్యోగులకు ఏడాదిగా తప్పని ఎదురుచూపులు నెలకు రూ.60 కోట్ల జీతాల భారం తగ్గినా.. బకాయిల చెల్లింపులో జాప్యం ఇవ్వని సొమ్ముపైనా టీడీఎస్ కోత.. కేంద్రానికి ఫిర్యాదు
వీఆర్‌ఎస్ సొమ్ముకు..
సాక్షి, విశాఖపట్నం: కన్నతల్లి లాంటి కర్మాగారం కష్టాల్లో ఉందని యాజమాన్యం కోరగానే 1,600 మంది ఉద్యోగులు తమ శాశ్వత ఉద్యోగాలను త్యాగం చేశారు. దీంతో వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌పై నెలకు సుమారు రూ.60 కోట్ల జీతాల భారం తగ్గింది. అయితే సంస్థను ఆదుకున్న ఆ ఉద్యోగులకే ఇప్పుడు యాజమాన్యం తీరని ద్రోహం తలపెడుతోంది. నిబంధనల ప్రకారం పదవీ విరమణ రోజే అందాల్సిన వీఆర్‌ఎస్ ప్రయోజనాలను ఏడాది గడుస్తున్నా పూర్తిగా చెల్లించకుండా నడివీధిన నిలబెట్టింది. కొందరికి 50 శాతం, మరికొందరికి 25 శాతం మాత్రమే చెల్లించి మిగిలిన మొత్తాన్ని వాయిదాల్లో ఇస్తామని తాజాగా సర్క్యులర్ జారీ చేయడం గమనార్హం. ఇదిలా ఉంటే.. కాగితాల్లో మాత్రం పూర్తి ప్యాకేజీ చెల్లించినట్లు చూపిస్తూ.. చేతికి అందని సొమ్ముపైనా టీడీఎస్ కోత విధించడం ఉద్యోగుల పాలిట ఆశనిపాతంగా మారింది. ఈ వ్యవహారంపై ప్రధాని కార్యాలయానికి, కేంద్ర ప్రభుత్వానికి ఉద్యోగ సంఘాలు ఫిర్యాదు చేశాయి.
వాయిదాల పేరిట వేధింపులు
2025 అక్టోబర్‌లో వీఆర్‌ఎస్–2 కింద, 2026 ఏప్రిల్‌లో వీఆర్‌ఎస్–3 కింద ఉద్యోగాల నుంచి వైదొలిగిన వారికి ఇప్పటికీ పూర్తి ప్యాకేజీ అందలేదు. వీఆర్‌ఎస్–2 ఉద్యోగులకు రెండు నెలల తర్వాత 50 శాతం మాత్రమే చెల్లించగా.. మిగతా సగం పెండింగ్‌లో ఉంది. వీఆర్‌ఎస్–3 ఉద్యోగులకు 25 శాతం మాత్రమే అందింది. తాజాగా సెప్టెంబర్ 28న జారీ చేసిన సర్క్యులర్‌లో అక్టోబర్ నుంచి మిగిలిన బకాయిలను ఆరు నెలల వాయిదాల్లో చెల్లిస్తామని యాజమాన్యం పేర్కొంది.
వీఆర్‌ఎస్–2, 3లో జాప్యం
స్టీల్‌ప్లాంట్ ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టేందుకు కేంద్రం ప్రకటించిన రూ.11,440 కోట్ల పునరుద్ధరణ ప్యాకేజీలో భాగంగా వీఆర్‌ఎస్ పథకాన్ని ప్రవేశపెట్టారు. సంస్థ ప్రయోజనాల కోసం సుమారు 1,600 మంది ఉద్యోగులు స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్నారు. తమకు రావాల్సిన పరిహారంలో 35–45 శాతం వరకు తక్కువగా ఉన్నప్పటికీ అంగీకరించి.. సంస్థ నుంచి బయటకు వచ్చారు. ఆర్‌ఐఎన్‌ఎల్ సర్క్యులర్, ప్రభుత్వ రంగ సంస్థల విభాగం (డీపీఈ) మార్గదర్శకాల ప్రకారం పూర్తి వీఆర్‌ఎస్ ప్యాకేజీని, ఆర్జిత సెలవుల మొత్తంతో సహా పదవీ విరమణ రోజే చెల్లించాల్సి ఉంది. వీఆర్‌ఎస్–2, 3 ఉద్యోగుల విషయంలో యాజమాన్యం జాప్యం చేస్తోంది.
నెల జీతాల ఆదాతోనే బకాయిలు చెల్లించొచ్చు
1,600 మంది సీనియర్ ఉద్యోగులు వైదొలగడంతో నెలకు సుమారు రూ.60 కోట్ల వరకు ఆదా అవుతోంది. అంటే ఏడాదికి దాదాపు రూ.500 కోట్ల మేర సంస్థకు ఖర్చు తగ్గింది. వీఆర్‌ఎస్–2 ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు రూ.58 కోట్లు కాగా.. ఆర్జిత సెలవుల (ఈఎల్) మొత్తం రూ.17 కోట్లు కలిపితే రూ.75 కోట్లు అవుతుంది. సంస్థకు ఆదా అవుతున్న ఒక నెల జీతాల డబ్బు కంటే ఈ బకాయిలు తక్కువే అయినప్పటికీ.. ఇవ్వడానికి మాత్రం యాజమాన్యానికి మనసు రావడం లేదంటూ కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ప్రధాని కార్యాలయానికీ
ఫిర్యాదు చేశాం
నిబంధనల ప్రకారం వీఆర్‌ఎస్ బకాయిలను వెంటనే చెల్లించాలని కోరుతూ ప్రధాని కార్యాలయానికి, కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశాం. కేంద్రం తక్షణమే జోక్యం చేసుకుని ఉద్యోగులకు రావాల్సిన బకాయిలన్నింటినీ వడ్డీతో సహా ఏకమొత్తంగా చెల్లించేలా ఆదేశాలు జారీ చేయాలి.
– పాడి త్రినాథరావు, ప్రధాన కార్యదర్శి,
విశాఖ స్టీల్ ఎంప్లాయీస్ యూనియన్
ఇవ్వని డబ్బుకూ టీడీఎస్!
వీఆర్‌ఎస్ ప్యాకేజీ మొత్తాన్ని 2025 అక్టోబర్‌లోనే ఉద్యోగులకు చెల్లించినట్లు యాజమాన్యం రికార్డుల్లో చూపించింది. ఆ మొత్తానికి టీడీఎస్ కట్ చేసింది. వాస్తవానికి వీఆర్‌ఎస్–2 ఉద్యోగులకు 50 శాతం, వీఆర్‌ఎస్–3 ఉద్యోగులకు 25 శాతం మాత్రమే చెల్లించి.. సుమారు రూ.75 కోట్ల బకాయిలను ఏడాదిగా ఇవ్వకుండా తిప్పుతోంది.


