మహారాణిపేట: ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జయంతిని పురస్కరించుకుని నవంబర్ 24న ప్రొద్దుటూరులో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘాల సమాఖ్య అధ్యక్షులు కె.వి.కృష్ణారెడ్డి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రెడ్డి సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ఆశీలమెట్టలోని శ్రీ వేమన సంక్షేమ సంఘం భవనంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన సంఘాలన్నీ సమన్వయంతో పనిచేసి విద్య, ఉపాధి, సామాజిక అభివృద్ధికి కృషి చేయాలని కృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వంటి చరిత్రలో నిలిచిన ప్రముఖుల సేవలు, త్యాగాలు, గొప్పతనాన్ని నేటి తరానికి పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఈ సభను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సమాఖ్యలో ఇప్పటికే 23 సంఘాలు అనుబంధంగా ఉన్నాయని చెప్పారు. సమాఖ్య కోశాధికారి డాక్టర్ ఎం.సుబ్బిరెడ్డి మాట్లాడుతూ పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులకు విద్యాపరంగా చేయూతనివ్వడం సమాఖ్య ప్రధాన లక్ష్యమన్నారు. ఆర్గనైజింగ్ సెక్రటరీ సి.శ్రీనివాసులు మాట్లాడుతూ రెడ్డి సంఘాల మధ్య సమన్వయం, పరస్పర సహకారం పెంపొందించాలన్నారు. సంయుక్త కార్యదర్శి కె.టి.రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని రెడ్డి సంఘాల వివరాలు, ఫోన్ నంబర్లతో డైరీని ముద్రించి సమాచార మార్పిడికి ఉపయోగపడేలా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. అసోసియేట్ ప్రెసిడెంట్ ఎస్.సంజీవరెడ్డి తాడేపల్లిలో రెండు ఎకరాల స్థలంలో సామాజిక భవన నిర్మాణానికి కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. కడప రెడ్డి సేవా సమితి ట్రెజరర్ జి.ఆదినారాయణ రెడ్డి వేమన పద్యాలను నేటి తరానికి చేరువ చేసేందుకు పుస్తకాలను ముద్రించి ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో శ్రీ వేమన సంక్షేమ సంఘం సలహా కమిటీ చైర్మన్ దేరెడ్డి నారాయణ రెడ్డి, అధ్యక్షుడు గొరుసు మహేశ్వర రెడ్డి, ప్రధాన కార్యదర్శి సత్తి నాగేశ్వర రెడ్డి, మాజీ ప్రధాన కార్యదర్శి సత్తి రామకృష్ణ రెడ్డి (గౌతమి), మాజీ కోశాధికారి సందిరెడ్డి బాలిరెడ్డి, మాజీ కార్పొరేటర్ సాడి పద్మారెడ్డి, ఉపాధ్యక్షులు, కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.


