డీలిమిటేషన్‌లో తేడాలపై వైఎస్సార్‌సీపీ అభ్యంతరం | - | Sakshi
Sakshi News home page

డీలిమిటేషన్‌లో తేడాలపై వైఎస్సార్‌సీపీ అభ్యంతరం

Oct 4 2026 11:49 AM | Updated on Oct 4 2026 11:49 AM

ఓటర్ల జాబితా, రిజర్వేషన్లలో పారదర్శకత పాటించాలి

రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా నిబంధనల మేరకు వ్యవహరించాలి

అవకతవకలు జరిగితే న్యాయపోరాటం: కేకే రాజు

డాబాగార్డెన్స్‌: జీవీఎంసీ పరిధిలో 120 వార్డుల డీలిమిటేషన్‌, ఓటర్ల జాబితా, రిజర్వేషన్ల ప్రక్రియను నిబంధనల మేరకు పారదర్శకంగా నిర్వహించాలని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు డిమాండ్‌ చేశారు. ఆయా అంశాలపై వచ్చిన అభ్యంతరాలను సమగ్రంగా పరిశీలించి, తప్పులను సరిచేసిన తర్వాతే తుది జాబితాలను ప్రకటించాలని కోరారు. ఈ మేరకు నియోజకవర్గ సమన్వయకర్తలు, పరిశీలకులు, మాజీ కార్పొరేటర్లు, వార్డు అధ్యక్షులతో కలిసి శనివారం జీవీఎంసీ అదనపు కమిషనర్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ వార్డుల డీలిమిటేషన్‌లో ఓటర్ల సంఖ్య మధ్య గణనీయమైన వ్యత్యాసం ఉందన్నారు. 105వ వార్డులో సుమారు 8,884 మంది ఓటర్లు ఉండగా, మరికొన్ని వార్డుల్లో 20 వేలకు పైగా ఉన్నారని తెలిపారు. వార్డుల విభజనకు అనుసరించిన ప్రమాణాలు, ఓటర్ల సంఖ్యలో వ్యత్యాసాలకు కారణాలను అధికారులు స్పష్టం చేయాలని కోరారు. ఓటర్ల జాబితా తయారీలో తప్పులు, అవకతవకలపై ఫిర్యాదులు అందుతున్నాయని, వాటిని క్షుణ్ణంగా పరిశీలించి అర్హులైన ఓటర్ల పేర్లు తొలగకుండా, అనర్హుల పేర్లను సరిచేసి తుది జాబితా రూపొందించాలని సూచించారు. కులాల వారీ ఓటర్ల వివరాలను కూడా నిబంధనల ప్రకారం పరిశీలించాలన్నారు. రిజర్వేషన్ల ఖరారులో కులాల వారీ జనాభా వివరాలు, అధికారిక రికార్డులు, చట్టపరమైన నిబంధనలను ప్రాతిపదికగా తీసుకోవాలని కేకే రాజు అన్నారు. రాజకీయ జోక్యానికి తావులేకుండా ప్రక్రియను నిర్వహించాలని, అధికారులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు లోనుకాకుండా నిబంధనల ప్రకారం విధులు నిర్వర్తించాలని సూచించారు. రాజకీయ నాయకుల అక్రమాలకు అధికారులు భాగస్వాములు కావద్దని హెచ్చరించారు. డీలిమిటేషన్‌ నుంచి ఓటర్ల జాబితా, రిజర్వేషన్ల వరకు ఎన్నికల ప్రక్రియలో ప్రతి దశ పారదర్శకంగా, నిష్పక్షపాతంగా సాగాలని పేర్కొన్నారు. స్థానిక సంస్థలు బలోపేతమైతే ప్రజలకు పరిపాలన మరింత చేరువవుతుందని, ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి స్థానిక సంస్థల ఎన్నికలు అవసరమని కేకే రాజు తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే న్యాయపరమైన చర్యలకు వెళ్లాల్సి వస్తుందని, అవసరమైతే పార్టీ తరఫున న్యాయపోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ఇప్పటికే మాజీ కార్పొరేటర్లతో కలిసి సంబంధిత అధికారులకు అభ్యంతరాలను తెలియజేశామని చెప్పారు. కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్తలు తిప్పల శ్రీనివాస్‌ దేవన్‌రెడ్డి, మొల్లి అప్పారావు, శాసన మండలి సభ్యుడు కుంభా రవిబాబు, మాజీ శాసన సభ్యుడు తిప్పల నాగిరెడ్డి, మాజీ డిప్యూటీ మేయర్లు కటుమూరి సతీష్‌, జియ్యాని శ్రీధర్‌, మాజీ ఫ్లోర్‌ లీడర్‌ బాణాల శ్రీనివాసరావు, పార్టీ నాయకులు డాక్టర్‌ జహీర్‌ అహ్మద్‌, పేడాడ రమణకుమారి, సతీష్‌వర్మ, పల్లా దుర్గ, పీవీ నారాయణ్‌, జీవీ రవిరాజు, జిల్లా అనుబంధ విభాగాల అధ్యక్షులు, మా జీ కార్పొరేటర్లు, వార్డు పార్టీ అధ్యక్షులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement