డాబాగార్డెన్స్: జీవీఎంసీ కాంట్రాక్టర్ల సమస్యలు పరిష్కరించకపోతే ఈ నెల 5 నుంచి నీటి సరఫరా, యూజీడీ ఆపరేషన్ పనులు నిలిపివేయనున్నట్టు జీవీఎంసీ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ప్రకటించింది. జీవీఎంసీ గాంధీ విగ్రహం వేదికగా కాంట్రాక్టర్స్ అసోసియేషన్ చేపట్టిన నిరసన శనివారం నాల్గో రోజుకి చేరింది. ఈ సందర్భంగా తాగునీటి సరఫరా అధికారులను కలిసి వినతిపత్రం అందజేశారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న బిల్లులు, డిపాజిట్లు విడుదల చేయడంతో పాటు పరిపాలన సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే సోమవారం నుంచి నిరవధిక మహాధర్నా, సమ్మె చేపడతామని తెలిపారు. సమ్మెతో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని కోరారు. కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు నాగరాజు, ప్రధాన కార్యదర్శి సంజీవరెడ్డి, మద్దాల రమేష్, జి.సింహాచలం, జి.వీరభద్రరావు, చిట్టిబాబు కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.


