మహారాణిపేట: జీవీఎంసీ రెండో సాధారణ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టర్ కార్యాలయంలో ఎన్నికల ఏర్పాట్లపై సమీక్షించారు. ఓటర్ల జాబితాలు, పోలింగ్ కేంద్రాలు, సిబ్బంది నియామకం, ఎన్నికల సామగ్రి, స్ట్రాంగ్ రూమ్‌లు, కౌంటింగ్ కేంద్రాలు, భద్రత తదితర అంశాలపై చర్చించారు. పోలింగ్ కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించి, స్ట్రాంగ్ రూమ్‌లు, పోలింగ్ కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఓటర్ల జాబితాలో తప్పులు లేకుండా చూడాలని, మారిన వార్డులు, కొత్తగా చేరిన వివరాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. జీవీఎంసీ పరిధిలో 120 వార్డులు, 1,990 పోలింగ్ కేంద్రాలు, 18,37,901 మంది ఓటర్లు ఉన్నారని కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు. ఎన్నికల విధుల కోసం 14,328 మంది సిబ్బందిని సిద్ధం చేస్తున్నామని, 4,800 బ్యాలెట్ పెట్టెలు సమకూర్చుకునేందుకు ప్రతిపాదనలు పంపినట్లు చెప్పారు. ఎన్నికల అనంతరం సామగ్రి భద్రపరచడం, ఓట్ల లెక్కింపునకు ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్ కళాశాలను గుర్తించినట్లు తెలిపారు. జిల్లా రెవెన్యూ అధికారి ఎం.విశ్వేశ్వరనాయుడు, డిప్యూటీ కలెక్టర్ గోవిందు, అడిషనల్ కమిషనర్లు పాల్గొన్నారు.


