‘రైతు’బజార్లలో నాసిరకం ఉల్లి | - | Sakshi
Sakshi News home page

‘రైతు’బజార్లలో నాసిరకం ఉల్లి

Oct 4 2026 11:49 AM | Updated on Oct 4 2026 11:49 AM

రూ.35 పెట్టినా చేతికొచ్చేది కుళ్లిన ఉల్లిపాయలే తక్కువ ధర పేరుతో చెత్త సరుకు అంటగడుతున్న వైనం గగ్గోలు పెడుతున్న వినియోగదారులు

మహారాణిపేట/గోపాలపట్నం: రైతుబజార్‌ కెళ్తే మేలైన సరుకు తక్కువ ధరకు దొరుకుతుందన్న నమ్మకం నీరుగారిపోతోంది. ఓవైపు బహిరంగ మార్కెట్‌లో ఉల్లి ధర కిలో రూ.60 నుంచి రూ.70 వరకు పలకడంతో సామాన్యులు రైతుబజార్ల బాట పడుతుంటే అక్కడ వారికి నిరాశే ఎదురవుతోంది. రైతుబజార్లలో కిలో రూ.35కే విక్రయిస్తున్నామని అధికారులు చెబుతున్నా.. అసలు విషయం అక్కడ దొరుకుతున్న ‘సరుకు’ చూస్తే అర్థమవుతోంది. నాణ్యత లేని, కుళ్లిపోయిన ఉల్లిపాయలను వినియోగదారుల నెత్తిన రుద్దుతుండటంతో జనం మండిపడుతున్నారు.

15 రైతుబజార్లలోనూ ఇదే దుస్థితి..: సుమారు 15 రైతుబజార్లలోనూ నాసిరకం ఉల్లి విక్రయాలే యథేచ్ఛగా సాగుతున్నాయి. తక్కువ ధరకు ఇస్తున్నారన్న పేరే తప్ప, సంచిలో వేస్తున్న ఉల్లిపాయల్లో సగానికి పైగా మెత్తబడిపోయినవి, కుళ్లిపోయి వాసన వస్తున్నవే ఉంటున్నాయి. ఇలాంటి పాడైపోయిన ఉల్లిపాయలు మాకెందుకు?’ అని వినియోగదారులు అధికారులను నిలదీస్తున్నారు.

ఆధార్‌ కార్డున్నా తప్పని అవస్థలు : ప్రతి కుటుంబానికి ఆధార్‌ కార్డు ఆధారంగా నెలకు రెండు కిలోల చొప్పున కిలో రూ.35కి విక్రయించేందుకు చర్యలు చేపట్టారు. అయితే గంటల తరబడి క్యూలైన్లలో నిలబడి తెచ్చుకున్న ఆ రెండు కిలోల సరుకు కూడా వంటకు పనికిరాకుండా పోతోందని సామాన్యులు వాపోతున్నారు. ధరల నియంత్రణ పేరుతో సబ్సిడీ ఇస్తూనే, నాసిరకం సరుకుతో ప్రజలను మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అధికారుల పర్యవేక్షణ శూన్యం : వివిధ ప్రాంతాల నుంచి ఉల్లి దిగుమతి చేసుకుంటున్నామని చెబుతున్న మార్కెటింగ్‌ శాఖ అధికారులు, ఆ ఉల్లి నాణ్యతను తనిఖీ చేయడంలో పూర్తిగా విఫలమయ్యారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి, నాసిరకం సరుకును తక్షణమే ఉపసంహరించుకోవాలని, నాణ్యమైన ఉల్లిని అందుబాటులోకి తెచ్చేలా రైతుబజార్లలో పర్యవేక్షణ పెంచాలని వినియోగదారులు డిమాండ్‌ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement