విశాఖ మొదటి అదనపు జిల్లా, సెషన్స్ జడ్జి వెంకటరమణ
సబ్బవరం: నేర దర్యాప్తులో ఆధారాల సేకరణ, పరిరక్షణ, ఫోరెన్సిక్ విశ్లేషణకు అత్యంత ప్రాధాన్యం ఉందని విశాఖపట్నం మొదటి అదనపు జిల్లా, సెషన్స్ జడ్జి ఎం.వెంకటరమణ తెలిపారు. దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం(డీఎస్‌ఎన్‌ఎల్‌యూ) లీగల్ ఇంక్యుబేషన్ సెంటర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వార్షిక ‘క్రైమ్ సీన్ ఇన్వెస్టిగేషన్–7.0’పోటీలు శనివారం ప్రారంభమయ్యాయి. ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆయన అనుకరణ నేర దృశ్యాన్ని ఆవిష్కరించి పోటీలకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దర్యాప్తు అధికారులు కేసులను శ్రద్ధగా విచారించినప్పటికీ సాక్ష్యాలను సక్రమంగా సేకరించి భద్రపరచడంలో జరిగే లోపాలు కేసుల ఫలితాలపై ప్రభావం చూపుతున్నాయని చెప్పారు.
నేర నిర్ధారణకు సమగ్ర దర్యాప్తు : డీఎస్‌ఎన్‌ఎల్‌యూ వైస్ చాన్సలర్ ఆచార్య డి.సూర్యప్రకాశరావు మాట్లాడుతూ డీఎస్‌ఎన్‌ఎల్‌యూ వైస్ ఛాన్సలర్ ఆచార్య డి. సూర్యప్రకాశరావు మాట్లాడుతూ కోర్టులో నేర నిర్ధారణకు సమగ్ర దర్యాప్తు కీలకమని తెలిపారు. విశ్రాంత జిల్లా జడ్జి, వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కార వేదిక చైర్మన్ బి.సత్యనారాయణ మాట్లాడుతూ క్రిమినల్ న్యాయశాస్త్రంలో కచ్చితత్వం అత్యంత అవసరమన్నారు. దర్యాప్తులోని ప్రతి అంశాన్ని నిరూపించాల్సి ఉంటుందన్నారు. ఈ పొటీల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన 20 ప్రముఖ విద్యా సంస్థల నుంచి 80 జట్లకు చెందిన 240 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. నేర దృశ్య నిర్వహణ, ఫోరెన్సిక్ విశ్లేషణ, క్రిమినల్ చట్టంలోని విధానపరమైన అంశాలపై విద్యార్థులు తమ నైపుణ్యాలను ప్రదర్శించనున్నారు. డీఎస్‌ఎన్‌ఎల్‌యూ రిజిస్ట్రార్ ఇన్‌చార్జి డాక్టర్ విశ్వచంద్రనాథ్, లీగల్ ఇంక్యుబేషన్ సెంటర్ ఫ్యాకల్టీ కో–ఆర్డినేటర్ ప్రొఫెసర్ సీపీ నందిని, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.


