డాబాగార్డెన్స్: జీవీఎంసీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎన్నికల వ్యయాన్ని నిబంధనల మేరకు పకడ్బందీగా నమోదు చేసి, ఆడిట్ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని జీవీఎంసీ అదనపు కమిషనర్ డీవీ రమణమూర్తి అధికారులను ఆదేశించారు. నామినేషన్ దాఖలు చేసిన నాటి నుంచి ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు అభ్యర్థుల ఖర్చులను నిర్ణీత విధానంలో నమోదు చేయాలని సూచించారు. జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో శనివారం ఎన్నికల వ్యయ పర్యవేక్షణపై ఆడిట్ అధికారులకు ప్రత్యేక శిక్షణ, సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రమణమూర్తి మాట్లాడుతూ అభ్యర్థుల డిపాజిట్, వ్యయ పరిమితి, ప్రచార వాహనాలు, బ్యానర్లు, జెండాలు, ప్రచార సామగ్రి, జన సమీకరణ, భోజన ఏర్పాట్లకు సంబంధించిన ఖర్చులను నిబంధనల ప్రకారం నమోదు చేయాలని సూచించారు. ఎన్నికల విధుల్లో అధికారులు రాజకీయ పార్టీలు, అభ్యర్థులకు అనుకూలంగా వ్యవహరించకుండా తటస్థంగా, నిష్పక్షపాతంగా పనిచేయాలని స్పష్టం చేశారు. అదనపు కమిషనర్ ఎస్‌ఎస్ వర్మ మాట్లాడుతూ ఎన్నికల నోటిఫికేషన్ అనంతరం పరిమిత సమయం మాత్రమే ఉండే అవకాశం ఉన్నందున అధికారులు ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని సూచించారు. ఎగ్జామినర్ ఆఫ్ అకౌంట్స్ సి.వాసుదేవరెడ్డి ఎన్నికల వ్యయ నమోదు, రిజిస్టర్ల నిర్వహణ, పరిశీలన, ఆడిట్ విధానాలపై పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. సమావేశంలో మేయర్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి దయానిధి, డీపీఓ నాగార్జున, స్టేట్ ఆడిట్, ట్రెజరీ, కోఆపరేటివ్ శాఖల అధికారులు, జీవీఎంసీ అధికారులు పాల్గొన్నారు.


