విశాఖపట్నం విమానాశ్రయంలో వాణిజ్య, విమాన సర్వీసులు కొనసాగించాలని సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి పి.చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. పీజీఆర్‌ఎస్‌లో వినతిపత్రం అందజేసిన అనంతరం కలెక్టరేట్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. భోగాపురం విమానాశ్రయానికి వాణిజ్య సేవలను పూర్తిగా తరలించాలన్న నిర్ణయం సరికాదన్నారు. నగరానికి అత్యంత చేరువలో ఉన్న విశాఖ ఎయిర్‌పోర్టును విద్యార్థులు, వ్యాపారులు, రోగులు, వృద్ధులు ఎంతో వినియోగించుకుంటున్నారని తెలిపారు. ఇక్కడ సేవలు నిలిపివేస్తే ప్రయాణ సమయం, ఖర్చు పెరగడంతో పాటు నగర పర్యాటకం, పెట్టుబడుల ప్రవాహంపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.


