సాగర తీరానికి
అంతర్జాతీయ ప్రమాణాలతో ‘ఇంటర్నేషనల్ మెరీనా’కు వీపీఏ ప్రతిపాదనలు భీమిలి, లైట్‌హౌస్, డాల్ఫిన్ నోస్, అవుటర్ హార్బర్ ప్రాంతాల పరిశీలన సాగరమాల ప్రాజెక్టులో భాగంగా పీపీపీ విధానంలో నిర్మాణానికి కసరత్తు ఇంటర్నేషనల్ క్రూయిజ్ టెర్మినల్‌కు అనుసంధానించే ప్రణాళిక
దేశంలోని ఇంటర్నేషనల్ మెరీనా
సాక్షి, విశాఖపట్నం: సాగర తీరంలో అలల సవ్వడి, కనువిందు చేసే ప్రకృతి అందాలు.. వీటికి త్వరలో అంతర్జాతీయ స్థాయి విలాసాలు తోడవనున్నాయి. సిటీ ఆఫ్ డెస్టినీగా పేరొందిన విశాఖపట్నం పర్యాటక రంగానికి కొత్త రూపు తీసుకురావాలనే లక్ష్యంతో విశాఖపట్నం పోర్టు అథారిటీ (వీపీఏ) ప్రణాళికను సిద్ధం చేసింది. సముద్రంపై విహరించే అత్యాధునిక లగ్జరీ బోట్లు, యాట్‌ల కోసం అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ‘ఇంటర్నేషనల్ మెరీనా’ ఏర్పాటుకు కసరత్తు ప్రారంభించింది. ఈ ప్రాజెక్టు పట్టాలెక్కితే సాగరనగరి దేశంలోనే కాకుండా ప్రపంచ పటంలోనూ గ్లోబల్ టూరిజం హబ్‌గా మారే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
పీపీపీ భాగస్వామ్యంతో..
కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక ‘సాగరమాల’ ప్రాజెక్టులో భాగంగా తీరప్రాంత అభివృద్ధికి విశాఖపట్నం పోర్టు అథారిటీ నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తోంది. ప్రభుత్వ నిధులతో మాత్రమే కాకుండా పబ్లిక్–ప్రైవేట్ భాగస్వామ్య (పీపీపీ) విధానంలో ఈ భారీ ప్రాజెక్టును అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం ఆసక్తి గల ప్రైవేట్ పెట్టుబడిదారుల నుంచి ఆసక్తి వ్యక్తీకరణ టెండర్లను ఇప్పటికే ఆహ్వానించింది. అలాగే పలు సంస్థలతో ప్రాథమిక స్థాయి చర్చలు నిర్వహించింది.
నాలుగు ప్రాంతాల్లో ఒకచోట..
ఇంటర్నేషనల్ మెరీనా నిర్మాణానికి అనువైన ప్రాంతాల ఎంపికలో భాగంగా భీమిలి, లైట్‌హౌస్, డాల్ఫిన్ నోస్‌తో పాటు విశాఖ పోర్టు అవుటర్ హార్బర్ లేదా కోస్టల్ బ్యాటరీ సమీప ప్రాంతాలను అధికారులు పరిశీలించారు. సముద్రపు అలల ప్రభావం తక్కువగా ఉండే ప్రాంతానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇటీవల అందుబాటులోకి వచ్చిన ఇంటర్నేషనల్ క్రూయిజ్ టెర్మినల్‌కు సమీపంలోనే మెరీనాను అనుసంధానం చేసే అవకాశాలనూ పరిశీలిస్తున్నారు. గ్లోబల్ టెండర్ల ప్రక్రియ పూర్తయిన అనంతరం ఈ నాలుగు ప్రాంతాల్లో సాంకేతిక పరీక్షలు నిర్వహించి తుది స్థలాన్ని ఎంపిక చేయనున్నారు.
సరికొత్త అనుభూతినిచ్చే మెరీనా
ఈ ఇంటర్నేషనల్ మెరీనా కేవలం పడవలు నిలిపే కేంద్రంగా మాత్రమే కాకుండా సమగ్ర వినోద, వాణిజ్య హబ్‌గా రూపుదిద్దుకోనుంది. అంతర్జాతీయ ప్రమాణాల లగ్జరీ బోట్లు, విలాసవంతమైన యాట్‌ల కోసం ప్రత్యేక బెర్త్‌లు ఏర్పాటు చేయనున్నారు. పర్యాటకుల కోసం ఆధునిక వాణిజ్య సముదాయాలు, ఫైన్ డైనింగ్ రెస్టారెంట్లు, వాటర్ స్పోర్ట్స్, వినోద కేంద్రాలు ఒకేచోట అందుబాటులోకి రానున్నాయి. దీంతో స్థానికులతో పాటు దేశీయ, విదేశీ పర్యాటకులకు సరికొత్త తీరప్రాంత అనుభూతి లభించనుంది. అంతేకాకుండా ఈ ప్రాజెక్టు పర్యాటక రంగానికే పరిమితం కాకుండా స్థానిక ఆర్థిక వ్యవస్థకు, ముఖ్యంగా ‘బ్లూ ఎకానమీ’ అభివృద్ధికి ఊతమివ్వనుంది. లాజిస్టిక్స్, హాస్పిటాలిటీ, టూరిజం తదితర రంగాల్లో ఉపాధి అవకాశాలు గణనీయంగా పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
అనుమతుల కోసం సమాలోచనలు
సముద్ర తీరంలో చేపట్టే ఈ భారీ నిర్మాణానికి సీఆర్‌జెడ్, కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ నుంచి అనుమతులు పొందడం కీలకం. సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్), పర్యావరణ ప్రభావ అంచనా (ఈఐఏ) నివేదికల ఆధారంగానే ప్రాజెక్టు వేగం, తుది రూపురేఖలు ఆధారపడి ఉంటాయని పోర్టు అధికారులు చెబుతున్నారు. ఈ ప్రక్రియలు వేగంగా పూర్తయితే కొచ్చి, గోవా, ముంబై, చైన్నె తరహాలో అంతర్జాతీయ మెరీనాతో విశాఖ సాగరతీరం కొత్త శోభను సంతరించుకోనుంది.


