రౌండ్‌టేబుల్ సమావేశంలో రాజకీయ, ప్రజా సంఘాల నేతల పిలుపు
విశాఖ విద్య: రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డును విశాఖలో కాకుండా అమరావతిలో ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేస్తున్న ప్రయత్నాలను తిప్పికొట్టాలని పలు సంఘాలకు చెందిన ప్రతినిధులు పిలుపునిచ్చారు. రైల్వే జోన్ ఎక్కడ ఉంటే ఆర్‌ఆర్‌బీ అక్కడే ఉంటుందని, దానికి వ్యతిరేకంగా అమరావతిలో ఏర్పాటు చేయాలంటూ రైల్వేమంత్రి అశ్వినీవైష్ణవ్‌కు ఎలా లేఖరాస్తారని ప్రశ్నించారు. ద్వారకానగర్‌లోని పౌరగ్రంథాలయంలో లోక్‌సత్తా ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో పలువురు నాయకులు మాట్లాడారు.
ఆర్‌ఆర్‌బీతో ఎన్నో ప్రయోజనాలు
ఆర్‌ఆర్‌బీ కోసం భువనేశ్వర్ వెళ్తే తెలుగు వాళ్లమని చావబాదారు. సర్టి ఫికెట్లు చించేశారు. అలాంటిది ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఆర్‌ఆర్‌బీ వస్తే దాన్ని అమరావతికి తీసుకుపోతే చాలా నష్టం జరుగుతుంది. ఆర్‌ఆర్‌బీతో రైల్వే ఉద్యోగాలతో పాటు దానికి అనుబంధ సంస్థలు ఏర్పడి మరికొందరికి ఉపాధి దొరుకుతుంది
సన్యాసిరావు, రిటైర్డ్ రైల్వే ఉద్యోగి
ఉత్తరాంధ్రపై బాబుది దొంగప్రేమ
ఉత్తరాంధ్ర ప్రజలు ముఖ్యమంత్రి చంద్రబాబును నమ్ముకుంటే మోసానికి గురవుతారు. భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంభోత్సం నాడు ఉత్తరాంధ్రకు రెక్కలు అన్నారు. ఇప్పుడేమో ఆర్‌ఆర్‌బీ రాకుండా అడ్డుకుంటున్నారు. ఇదేనా చిత్తశుద్ధి.
బి.వి.రామ్, అధ్యక్షుడు, తెలుగు శక్తి
ఉత్తరాంధ్ర యువతతో ఆటలా..
ఉత్తరాంధ్ర అంటే చిన్నచూపు కొనసాగుతోంది. దేశంలో ఉన్న ఆర్‌ఆర్‌బీలన్నీ రైల్వే జోన్ ఉన్న చోటనే ఉన్నాయి. అలా కాదని అమరావతిలో ఆర్‌ఆర్‌బీ ఏర్పాటు చేయడం రైల్వే నిబంధనలకు విరుద్ధం. యువతను మోసం చేయడమే.
జగన్‌మోహిని, అబ్దుల్ కలాం
స్వచ్ఛంద సంస్థ, విజయనగరం
తలొక చోట, మొండెం
మరో చోటా
ప్రభుత్వ ఆలోచనలు చూస్తుంటే తల ఒక చోట, మొండెం మరో చోట పెట్టేలా ఉంది. విశాఖలో రైల్వే జోన్, అమరావతిలో ఆర్‌ఆర్‌బీ ఏర్పాటు చేయడం కరెక్ట్ కాదు. ఉత్తరాంధ్ర అభివృద్ధి అంటే భోగాపురం ఎయిర్‌పోర్టు ఒక్కటే కాదు.
సుగుణేశ్వరి, ఆర్‌ఎంపీ అసోసియేషన్ నేత
మన నేతలకు చిత్తశుద్ధి ఉందా
ప్రభుత్వ నిర్ణయంతో భావితరాల విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది. చంద్రబాబు ఏది చెబితే అది విన డం కాదు. ఆర్‌ఆర్‌బీ విషయంలో కూటమి నేతల వైఖరి బయటపడాలి. విశాఖను కాదని ఎలాంటి నిర్ణయం తీసుకున్నా యువత నుంచి తిరుగుబాటు తప్పదు. – పి.శ్రీనివాస్,
కన్వీనర్, ఏయూ పరిరక్షణ కమిటీ
బాబు ఆలోచనలు ఇంతే..
ఉత్తరాంధ్ర రాజకీయ ప్రజాప్రతినిధుల్లో అత్యధికులు వలసవాదులే. వారికి ఉత్తరాంధ్ర ఓట్లు కావాలి కానీ అభివృద్ధి వద్దు. అలాంటి వారు చంద్రబాబు నిర్ణయాన్ని వ్యతిరేకించలేరు. ఎన్నో ఏళ్లుగా రైల్వే జోన్ కోసం పోరాడితే అత్తెసరుగా జోన్ కేటాయించారు. అందులో ఆర్‌ఆర్‌బీ లేకపోతే ఏంటి ప్రయోజనం. ఎన్.శివశంకర్, కన్వీనర్,
జర్నలిస్టు ఉత్తరాంధ్ర పరిరక్షణ వేదిక


