ఆరిలోవ: జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న ఆయాలు నెలల తరబడి వేతనాలు అందక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారికిచ్చే అరకొర వేతనాలను కూడా సకాలంలో చెల్లించకుండా కూటమి ప్రభుత్వం పస్తులు పెడుతోంది. జీతాల కోసం అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా.. ఎవరూ వీరి పరిస్థితిని పట్టించుకోకపోవడం గమనార్హం.
వెట్టిచాకిరీ చేయిస్తూ.. జీతాలు ఎగ్గొడుతూ..
జిల్లాలోని జెడ్పీ ఉన్నత పాఠశాలల్లో సుమారు 75 మంది ఆయాలు విధులు నిర్వహిస్తున్నారు. వీరంతా హైస్కూళ్లలో పగటిపూట వాచ్‌మెన్ బాధ్యతలతో పాటు మధ్యాహ్న భోజన విభాగాలు, మరుగుదొడ్ల నిర్వహణ, తరగతి గదుల పరిశుభ్రత వంటి పనులన్నీ భారంగా మోస్తున్నారు. రోజంతా కష్టపడినా వీరికి నెలకు ఇచ్చేది కేవలం రూ.6 వేలు వేతనం మాత్రమే. కనీసం ఆ మొత్తాన్ని కూడా సకాలంలో ఇవ్వకుండా ప్రభుత్వం బకాయిలు పెట్టింది. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు ఏడు నెలలుగా వీరికి నయాపైసా జీతం చెల్లించలేదు.
అప్పుల ఊబిలో కుటుంబాలు
దీంతో ప్రతి నెలా వేతనాల కోసం ఆశగా ఎదురుచూస్తూ, కుటుంబం గడవక ఆయాలు అల్లాడిపోతున్నారు. కుటుంబ జీవనం, పిల్లల చదువుల కోసం అప్పులు చేసి కాలం వెళ్లదీస్తున్నామని వారు కన్నీటిపర్యంతమవుతున్నారు. చిన్న ఉద్యోగుల జీవితాలతో ప్రభుత్వం ఈ విధంగా ఆడుకోవడం దారుణమని మండిపడుతున్నారు.
ప్రకటనలకే పరిమితమైన
లోకేష్ ఉపన్యాసాలు
ఉద్యోగులందరికీ ప్రతి నెలా ఒకటో తేదీనే వేతనాలు వేస్తామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చేస్తున్న ఉపన్యాసాలు కేవలం ప్రకటనలకే పరిమితమవుతున్నాయనడానికి వీరే నిదర్శనం. అట్టడుగున ఉండి సేవలు అందించే ఆయాల వేతనాలను నెలల తరబడి బకాయిలు పెట్టడంపై నిరుపేద కార్మికుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ప్రభుత్వం ఇప్పటికై నా స్పందించి వెంటనే బకాయి వేతనాలను విడుదల చేసి తక్షణమే తమ కుటుంబాలను ఆదుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.


