పెదగంట్యాడ: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో పారిశుధ్య పనుల కోసం వెళ్లిన జీవీఎంసీ పారిశుధ్య కార్మికుడు అదృశ్యమయ్యాడు. న్యూపోర్టు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జీవీఎంసీ 64వ వార్డు పరిధిలోని యారాడ గ్రామానికి చెందిన పిల్ల పైడిరాజు జీవీఎంసీ జోన్–6లో పారిశుధ్య కార్మికుడిగా పనిచేస్తున్నాడు. గత నెల 30న భోగాపురం ఎయిర్‌పోర్టులో నిర్వహించిన శుభ్రత కార్యక్రమానికి తోటి కార్మికులతో కలిసి వెళ్లాడు. విమానాశ్రయ ప్రారంభోత్సవ కార్యక్రమం ముగిసిన అనంతరం ఇతర కార్మికులంతా ఇళ్లకు చేరుకోగా, పైడిరాజు మాత్రం తిరిగి రాలేదు. దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు అతని ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టాలని కోరుతూ సోమవారం న్యూపోర్టు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


