బీచ్‌రోడ్డు : ప్రపంచ వ్యాప్తంగా ఏఐ డేటా సెంటర్ల ఏర్పాటుపై వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో, ఉత్తరాంధ్రలో ప్రతిపాదించిన నాలుగు డేటా సెంటర్ల (అనకాపల్లి, అచ్యుతాపురం, ఆనందపురం, విజయనగరం) వల్ల ప్రజల్లో ప్రాణభయం నెలకొందని తెలుగు శక్తి అధ్యక్షుడు బి.వి.రామ్ అన్నారు. సోమవారం నగరంలోని ఓ హోటల్‌లో అఖిలపక్షాలు, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సముద్ర తీర ప్రాంతమైన మచిలీపట్నం నుంచి కేబుల్ తీసుకెళ్లి అమరావతిలో ఐదు కాదు, పది డేటా సెంటర్లు ఏర్పాటు చేసుకోవాలని కూటమి ప్రభుత్వానికి సూచించారు. ఉత్తరాంధ్రలో డేటా సెంటర్ల ఏర్పాటుతో భారీ స్థాయిలో విద్యుత్ వినియోగం, నీటి వనరుల దుర్వినియోగం, ఎలక్ట్రానిక్ వ్యర్థాల (ఈ–వేస్ట్) పెరుగుదల వంటి సమస్యలు తలెత్తి పర్యావరణానికి తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని అన్నారు. వైఎస్సార్‌సీపీ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు బోని శివరామకృష్ణ మాట్లాడుతూ జూలై 18న అమెరికాలోని 50కి పైగా నగరాల్లో ఏఐ డేటా సెంటర్లకు వ్యతిరేకంగా నిరసనలు జరిగాయని తెలిపారు. ఏఐ మౌలిక సదుపాయాల వేగవంతమైన విస్తరణతో విద్యుత్ డిమాండ్, నీటి వినియోగం పెరగడంతో పాటు శబ్ద కాలుష్యం అధికమవుతోందన్నారు. అలాగే భూ వినియోగంలో మార్పులు చోటుచేసుకుని, ప్రజారోగ్యం, పర్యావరణం, జాతీయ భద్రతపై కూడా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయని పేర్కొన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నగర అధ్యక్షుడు ఆడాల వెంకట వర్మరాజు, సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్.కే. రహమాన్, సీపీఎం జిల్లా కార్యదర్శి శ్రీమతి మణి, ఎస్సీ దళిత నాయకుడు పెద్దాడ రమణ, సన్ మూర్తి తదితరులు పాల్గొన్నారు.


