పెదగంట్యాడ: పాత గంగవరం తీరంలో ఆదివారం సముద్రంలో గల్లంతైన యువతి, యువకుడి ఆచూకీ సోమవారం కూడా లభ్యం కాలేదు. న్యూపోర్టు పోలీస్‌స్టేషన్ సీఐ కామేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం.. జాలరిపేట రెల్లివీధికి చెందిన నీతూ (18), పెందుర్తి పురుషోత్తపురానికి చెందిన సరజాల దామోదర్ (31)తో పాటు మరో ఐదుగురు ఆదివారం ఉదయం పాత గంగవరం తీరంలో ఫొటోషూట్ చేస్తుండగా ఒక్కసారిగా పెద్ద అలలు దూసుకొచ్చాయి. దీంతో నీతూ, దామోదర్ సముద్రంలో కొట్టుకుపోయారు. వారి ఆచూకీ కోసం న్యూపోర్టు పోలీసులు నేవీ, కోస్టుగార్డు సిబ్బందితో కలిసి ఆదివారం ఉదయం నుంచి సోమవారం సాయంత్రం వరకు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. నేవీ హెలికాప్టర్, డ్రోన్ సాయంతో సముద్ర తీర ప్రాంతాన్ని గాలించినప్పటికీ ఎలాంటి ఆచూకీ లభించలేదు. దీంతో మంగళవారం కూడా గాలింపు కొనసాగిస్తామని సీఐ తెలిపారు. గల్లంతైన ఇద్దరి ఆచూకీ ఇంకా లభ్యం కాకపోవడంతో వారి తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులు పాత గంగవరం తీరానికి చేరుకుని ఆందోళన వ్యక్తం చేశారు.


