విశాఖ విద్య: ఉదయం భగభగ మండిన ఎండతో ఉక్కిరిబిక్కిరైన మహా విశాఖ సాయంత్రానికి ఒక్కసారిగా చల్లబడింది. నగరమంతా దట్టమైన కారుమబ్బులు అలుముకోవడంతో వాతావరణం ఆహ్లాదకరంగా మారింది. కొన్నిచోట్ల వర్షం కురవడంతో ప్రజలకు ఉక్కపోత నుంచి ఉపశమనం లభించింది. ఆకస్మికంగా వర్షం ప్రారంభం కావడంతో వాహనదారులు ఆశ్రయం కోసం పరుగులు తీశారు. క్యుములోనింబస్ మేఘాల ప్రభావంతో వీచిన బలమైన ఈదురుగాలులు నగరాన్ని చుట్టుముట్టాయి.
నేలకొరిగిన భారీ వృక్షం
సీతమ్మధార కేఆర్‌ఎం కాలనీలోని ఆక్సిజన్ టవర్స్ వెనుక ఉన్న భారీ వృక్షం నేలకొరిగి కారుపై పడింది. అదృష్టవశాత్తు కారులో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనతో ఆ రహదారిలో కొంతసేపు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.


