ముగ్గురు అరెస్ట్
అల్లిపురం: నకిలీ ట్రేడింగ్ యాప్ ద్వారా జరిగిన రూ.52.16 లక్షల సైబర్ మోసాన్ని ఛేదించి, దుబాయ్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న అంతర్రాష్ట్ర సైబర్ ముఠాకు మ్యూల్ బ్యాంక్ ఖాతాలు అందించిన ముగ్గురు నిందితులను హైదరాబాద్‌లో విశాఖ సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణలో ‘సెలట్రో ఇన్’ పేరుతో నకిలీ ట్రేడింగ్ యాప్‌ను ఉపయోగించి ఇద్దరు బాధితుల నుంచి మొత్తం రూ.52,16,500 మోసపోయినట్లు గుర్తించారు. సాంకేతిక ఆధారాలు, బ్యాంకు లావాదేవీల విశ్లేషణ ఆధారంగా నిందితులు తమ కుటుంబ సభ్యులు, స్నేహితుల బ్యాంకు ఖాతాలను సేకరించి వాటిని సైబర్ నేరగాళ్లకు మ్యూల్ ఖాతాలుగా అందించినట్లు పోలీసులు వెల్లడించారు. అరెస్ట్ అయిన వారిలో తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌కు చెందిన సయ్యద్ అలీ అబ్బాస్ హుస్సేన్ జాఫ్రీ, చాంద్రాయణగుట్టకు చెందిన షేక్ యూసుఫ్, బండ్లగూడకు చెందిన జాకీర్ హుస్సేన్ ఉన్నారు. వీరిని సోమవారం రిమాండ్‌కు తరలించారు. నిందితుల మొబైల్ ఫోన్లలో లభించిన డిజిటల్ ఆధారాలను ఫోరెన్సిక్ పరీక్షల కోసం పంపించినట్లు పోలీసులు తెలిపారు.


