మన విశాఖ స్వచ్ఛతకు
ప్రజలు సహకరించాలి
జీవీఎంసీ కమిషనర్
కేతన్‌గార్గ్ పిలుపు
డాబాగార్డెన్స్: విశాఖను దేశంలోనే అత్యంత పరిశుభ్ర నగరంగా ప్రథమ స్థానంలో నిలిపేందుకు జీవీఎంసీ ‘ఒక్క నిమిషం.. 4 డబ్బాలు’ పేరిట ప్రత్యేక అవగాహన కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు జీవీఎంసీ కమిషనర్ కేతన్‌గార్గ్ వెల్లడించారు. జీవీఎంసీ ప్రధాన కార్యాలయ సమావేశ మందిరంలో సోమవారం అదనపు కమిషనర్లు డీవీ రమణమూర్తి, పి.నల్లనయ్య, ప్రధాన వైద్యాధికారి డాక్టరు నరేష్‌కుమార్‌లతో కలిసి ఆయన ఈ అవగాహన పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వచ్ఛ సర్వేక్షణ్ 2025–26 లక్ష్యాల్లో భాగంగా నగరాన్ని మరింత పరిశుభ్రంగా, ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దేందుకు ప్రజల భాగస్వామ్యం అత్యంత అవసరమని తెలిపారు. ప్రతి ఇంట్లో ఉత్పత్తయ్యే చెత్తను కేవలం ఒక్క నిమిషం సమయం కేటాయించి, నాలుగు వేర్వేరు డబ్బాల్లో వేరు చేసి పారిశుధ్య కార్మికులకు అందజేయాలని సూచించారు. వ్యర్థాల శాసీ్త్రయ నిర్వహణను సులభతరం చేయడం కోసం తడిచెత్తను ఆకుపచ్చ డబ్బాలో, పొడి చెత్తను నీలం డబ్బాలో, హానికరమైన వ్యర్థాలను ఎరుపు డబ్బాలో, ప్రత్యేక వ్యర్థాలను నలుపు రంగు డబ్బాలో వేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ప్రతిరోజూ ఇళ్ల వద్దే చెత్తను వేరు చేసి పారిశుద్ధ్య సిబ్బందికి అందజేయడం ద్వారా ఈ కార్యక్రమానికి పూర్తి సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు.


