మహారాణిపేట: పలు సమస్యల సాదన కోసం సోమవారం వేరువేరు సంఘాల ఆధ్వర్యంలో జరిగిన నిరసన ప్రదర్శనలు,ధర్నాలతో కలెక్టర్ కార్యాలయం దద్దరిల్లింది. ఆందోళన కారులతో కలెక్టర్ కార్యాలయం వేడెక్కింది. సమస్యలపై గళమెత్తిన ఆర్టీసీ, మధ్యాహ్న భోజన కార్మికులు, ఎంటీఎస్ ఉపాధ్యాయులు, బోట్ ఆపరేటర్లు నినదించారు.
ఆర్టీసీని ప్రభుత్వమే నడపాలి
ఆర్టీసీని ప్రైవేటీకరించడం తప్పనిసరని సంస్థ చైర్మన్ కొనకల నారాయణ ప్రకటించడం బాధ్యతారాహిత్యమని ఏపీ జేఏసీ అమరావతి జిల్లా అధ్యక్షుడు ఎస్. నాగేశ్వరరెడ్డి, అసోసియేట్ చైర్మన్ ఎస్.ఎ. త్రినాథ్ విమర్శించారు. సోమవారం పీజీఆర్‌ఎస్‌లో జేసీకి వినతిపత్రం సమర్పించిన అనంతరం వారు కలెక్టరేట్ ఎదుట మీడియాతో మాట్లాడారు. గ్రామీణ, ఏజెన్సీ ప్రాంతాలకు రవాణా సౌకర్యం కల్పిస్తూ, మహిళలకు ఉచిత ప్రయాణం, వృద్ధులు, విద్యార్థులకు రాయితీ పాసులు అందిస్తున్న ఆర్టీసీని కార్పొరేట్ సంస్థల గుప్పెట్లోకి నెట్టడం దుర్మార్గమన్నారు. ఈ నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోకపోతే ప్రజా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు పాల్గొన్నారు.
మధ్యాహ్న భోజన పథకాన్ని అక్షయపాత్రకు అప్పగించవద్దు
మధ్యాహ్న భోజన పథకాన్ని అక్షయపాత్ర ఫౌండేషన్‌కు అప్పగించే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు గూనూరు వరలక్ష్మి డిమాండ్ చేశారు. కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన నిరసన అనంతరం జేసీకి వినతిపత్రం సమర్పించారు. ఈ పథకాన్ని అప్పగిస్తే కార్మికులు ఉపాధి కోల్పోతారని, ఉదయం ఎప్పుడో వండిన ఆహారం వల్ల విద్యార్థులకు పోషకాలు అందవని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో యూనియన్ జిల్లా కార్యదర్శి జి. మంగశ్రీ, మణి, అప్పలనరసమ్మ తదితరులు పాల్గొన్నారు.
బోట్ ఆపరేటర్స్ అసోసియేషన్ అక్రమ ఎన్నికలను రద్దు చేయాలి
ఏపీ మెకనైజ్డ్ ఫిషింగ్ బోట్ ఆపరేటర్స్ అసోసియేషన్‌లో జరిగిన అక్రమ ఎన్నికలను రద్దు చేసి, నూతన ఎన్నికల నిర్వహణకు స్పెషల్ ఆఫీసర్‌ను నియమించాలని అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు వాసుపల్లి జానకిరామ్ డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపిన అనంతరం ఆయన కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. తక్షణమే జనరల్ బాడీ సమావేశం ఏర్పాటు చేసి సీక్రెట్ బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు జరపాలన్నారు. డీజిల్ ధరలను తగ్గించి, ఫిషింగ్ బోట్లకు లీటర్‌పై రూ.25 సబ్సిడీ ఇవ్వాలని, విశాఖ పోర్ట్ ట్రస్ట్ మంజూరు చేసిన భారీ క్రేన్లను బోట్ల మరమ్మతుల కోసం వెంటనే అందుబాటులోకి తెచ్చి నష్టాల్లో ఉన్న బోటు యజమానులను ఆదుకోవాలని కోరారు.
సమస్యలపై గళమెత్తిన ఆర్టీసీ,
మధ్యాహ్న భోజన కార్మికులు,
బోట్ ఆపరేటర్లు


