ఎన్‌ఎంయూఏ రాష్ట్ర నాయకుడు మోహన్
మద్దిలపాలెం: ఆర్టీసీలో ఎలక్ట్రికల్ బస్సుల నిర్వహణ బాధ్యతలను ప్రైవేటీకరణ చేయాలనే నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ (ఎన్‌ఎంయూఏ) జిల్లా నాయకులు డిమాండ్ చేశారు. ఎన్‌ఎంయూఏ సెంట్రల్ కమిటీ ఆదేశాల మేరకు ఈ నెల 20, 21 తేదీల్లో చేపట్టనున్న రాష్ట్రవ్యాప్త ఆందోళనల వివరాలను సోమవారం మద్దిలపాలెంలోని రామ్మోహన్ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర కోశాధికారి పీవీవీ మోహన్, జిల్లా అధ్యక్షుడు ఏకే శివాజీ మాట్లాడుతూ.. ఎలక్ట్రిక్ బస్సుల ప్రైవేటీకరణ వల్ల ఆర్టీసీ నిర్వీర్యమయ్యే ప్రమాదం ఉందని, వీటిని ఆర్టీసీ సిబ్బందితోనే నడపాలని కోరారు. సీ్త్ర శక్తి పథకం వల్ల ప్రయాణికుల రద్దీ పెరిగి ఓఆర్ 100 శాతం దాటిందని, పాత బస్సుల వల్ల డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్‌లు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని పేర్కొన్నారు. తక్షణమే కొత్త బస్సులు కొనుగోలు చేయాలని, ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే పాత ప్రభుత్వ పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని, చిన్న పొరపాట్లకు ఇచ్చే కఠినమైన శిక్షలను నిలిపివేయాలని, మహిళా ఉద్యోగులకు చైల్డ్ కేర్ లీవులు మంజూరు చేయాలని కోరారు. కార్యక్రమంలో జోనల్ మాజీ కార్యదర్శి ఎంవీఆర్ మూర్తి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కె.ఎస్.యన్ మూర్తి , వె.రాంబాబు, మద్దిలపాలెం అధ్యక్ష కార్యదర్శులు చిన్న ఈశ్వర రావు, ఆర్.శ్రీను, ఎ.ఎస్ నాయుడు, వాల్తేర్ జోనల్ మెంబర్ రాజు, అధ్యక్షులు ఎస్.యం నాయుడు తదితరులు పాల్గొన్నారు.


