మహారాణిపేట: కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజల నుంచి జాయింట్ కలెక్టర్ విద్యాధరి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజలు తమ పనుల కోసం పనులు మానుకుని, సెలవులు పెట్టి వస్తుంటారని, అందువల్ల అధికారులు వారి పట్ల మర్యాదగా, సానుభూతితో వ్యవహరించి సమస్యలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. ఫిర్యాదుదారుడి స్థానంలో ఉండి ఆలోచిస్తేనే వారి ఇబ్బందులు అర్థమవుతాయని, అధికారులు విధి నిర్వహణగా కాకుండా మానవీయ కోణంలో సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని స్పష్టం చేశారు. మొత్తం 387 వినతులు అందగా..జీవీఎంసీకి 163, రెవెన్యూ విభాగానికి 33, పోలీస్ శాఖకు 26 రాగా, ఇతర శాఖలకు సంబంధించి 165 వినతులు వచ్చాయి. కార్యక్రమంలో డీఆర్వో ఎం. విశ్వేశ్వర్ నాయుడు, జీవీఎంసీ అడిషనల్ కమిషనర్ సత్యవేణి, డిప్యూటీ కలెక్టర్ గోవింద్ , వివిధ విభాగాల అధికారులు పాల్గొని అర్జీలను స్వీకరించారు.


