తాటిచెట్లపాలెం: విద్యుత్ సంస్థల్లో దశాబ్దాలుగా పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం సీతమ్మధారలోని ఏపీఈపీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయం వద్ద కార్మికులు ధర్నా నిర్వహించారు. యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ముజఫర్ అహ్మద్, గౌరవాధ్యక్షుడు ఆర్.కె.ఎస్.ఇ. కుమార్‌లు మాట్లాడుతూ ట్రాన్స్‌కో, జెన్‌కో, డిస్కంలలో షిఫ్ట్ ఆపరేటర్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, మీటర్ రీడర్లు, వాచ్‌మెన్‌లు, లైన్‌మెన్‌లుగా ఎంతోమంది కార్మికులు ప్రాణాలకు తెగించి తక్కువ వేతనాలతో పనిచేస్తున్నారన్నారు. దశాబ్దాలుగా విధి నిర్వహణలో ఉన్న తమను పర్మనెంట్ చేయకపోగా, పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనాలు కూడా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యలపై ముఖ్యమంత్రి, విద్యుత్ శాఖ మంత్రి, ఉన్నతాధికారులకు పలుమార్లు వినతులు సమర్పించినా ఫలితం లేకపోయిందన్నారు. అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని సంస్థ సీఎండీ పృథ్వీతేజ్ ఇమ్మడికి అందజేశారు. యూనియన్ నాయకులు వెంకట అప్పారావు, నానాజీ, శ్రీను, సురేష్, హరిత, అవతారంతో పాటు పెద్ద సంఖ్యలో కాంట్రాక్ట్ కార్మికులు పాల్గొన్నారు.


