కనులారా కనరా.. అప్పన్న నిజరూపం | - | Sakshi
Sakshi News home page

కనులారా కనరా.. అప్పన్న నిజరూపం

Apr 19 2026 7:17 AM | Updated on Apr 19 2026 7:17 AM

2 లక్షల మందికి పైగా భక్తులు వస్తారని అంచనా

తెల్లవారుజామున 3.30 గంటలనుంచి సర్వదర్శనం ప్రారంభం

సాయంత్రం 6 గంటల తర్వాతసింహగిరిపైకి భక్తులకు అనుమతి నిలిపివేత

సింహగిరిపై కొలువుదీరిన శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి చందనోత్సవం సోమవారం జరగనుంది. వరాహ, నారసింహ రూపాలను ఒక్కటిగా చేసుకుని ఏడాదంతా చందనం మణుగుల్లో దర్శనమిచ్చే స్వామి తన నిజరూప దర్శన భాగ్యాన్ని భక్తులకు అందజేయనున్నారు. స్వామి నిజరూప దర్శనం చేసుకునేందుకు ఈ సారి 2 లక్షల మందికి పైగా భక్తులు వస్తారని అంచనా. భక్తుల దర్శనాల్లో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేసినట్లు యంత్రాంగం తెలిపింది.

ఒంటి గంట నుంచి వైదిక కార్యక్రమాలు

చందనోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం తెల్లవారుజామున ఒంటి గంట నుంచి పాంచరాత్ర ఆగమశాస్త్రం ప్రకారం అర్చకులు వైదిక కార్యక్రమాలు ప్రారంభిస్తారు. సుప్రభాత సేవ, విష్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, రుత్విగ్వరణం, పంచకలశావాహనం చేస్తారు. అనంతరం వెండి బొరుగులతో స్వామిపై ఉన్న చందనాన్ని విసర్జింపజేసి, నిజరూప దర్శనమిచ్చేలా ఆరా ధన నిర్వహిస్తారు. తెల్లవారుజామున 3 గంటలకు దేవస్థానం అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్‌ గజపతిరాజుకు తొలి దర్శనం కల్పిస్తారు. తదుపరి రాష్ట్ర ప్రభుత్వం తరపున హోంమంత్రి పట్టువస్త్రాలను సమర్పిస్తారు. 3.30 గంటల నుంచి 5 గంటల వరకు ప్రముఖులకు అంతరాలయ దర్శనం కల్పిస్తారు. ఈ ఏడాది ఒకే సారి సుమారు 23 వేల మంది భక్తులు వేచి ఉండేలా క్యూలు ఏర్పాటు చేశారు. గంటకు సుమారు 10 వేల మంది భక్తులకు దర్శనం కల్పించేలా ప్రణాళిక రూపొందించారు.

దర్శన సమయాలు.. ప్రత్యేక ఏర్పాట్లు

● ఉచిత దర్శనం, రూ.300 దర్శనం తెల్లవారుజామున 3.30 గంటల నుంచి ప్రారంభిస్తారు. ● రూ.1000 దర్శనం ఉదయం 5 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు 9 స్లాట్లలో కల్పిస్తారు. ● రూ.1500 దర్శనం ఉదయం 3.30 గంటల నుంచి 5 గంటల వరకు ఉన్న టైమ్‌ స్లాట్‌లో అంతరాలయ దర్శనం కల్పిస్తారు. ఉదయం 6 గంటల నుంచి 7.30 వరకు, తిరిగి ఉదయం 8 నుంచి 9.30 వరకు ఉన్న టైమ్‌ స్లాట్లలో నీలాద్రి గుమ్మం వద్ద నుంచి లఘు దర్శనం కల్పిస్తారు.

● దేవస్థానం సిబ్బందికి, పెన్షనర్లకు, ఇతర శాఖల సిబ్బందికి, వారి కుటుంబ సభ్యులకు రూ.300 టికెట్లు ప్రత్యేకంగా జారీ చేశారు. వీరిని మధ్యాహ్నం 3.30 గంటల నుంచి సాయంత్రం 5.30 వరకు రూ.1000 దర్శనం క్యూల్లో అనుమతిస్తారు. ● దివ్యాంగులను ఉదయం 10 నుంచి 11 గంటల వరకు, తిరిగి సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు దర్శనానికి అనుమతిస్తారు. ● తెల్లవారుజామున ఒంటి గంట నుంచి కొండ దిగువ నుంచి కొండపైకి ఆర్టీసీ బస్సులను అనుమతిస్తారు. సాయంత్రం 6 గంటల నుంచి కొండపైకి బస్సులను, ఇతర వాహనాలను, అలాగే మెట్ల మార్గంలో భక్తులను అనుమతించరు. ● రాత్రి 7 గంటలకు దర్శన క్యూల ప్రవేశ ద్వారాలను మూసివేస్తారు. అప్పటికే క్యూల్లో ఉన్న భక్తులందరికీ రాత్రి 11 గంటల వరకు దర్శనాలు కల్పిస్తారు. ● రాత్రి 8 గంటల నుంచి 11 గంటల వరకు సహస్ర ఘటాభిషేకం నిర్వహిస్తారు. తదుపరి శీతలోపచారాలు, ఇతర వైదిక కార్యక్రమాలు చేపడతారు. అనంతరం తొలివిడత చందనం సమర్పిస్తారు. ● వెహికల్‌ పాస్‌ ఉన్న వాహనాలను, ప్రోటోకాల్‌, వీఐపీ పాస్‌లు ఉన్న వాటిని మాత్రమే ఘాట్‌ రోడ్డులో కొండపైకి అనుమతిస్తారు. యజమాని కమ్‌ డ్రైవర్‌(ఒక్కరే) అయితే ఆ వాహనాన్ని అనుమతించరు. ● దేవస్థానం సిబ్బంది, డిప్యూటేషన్‌పై వచ్చే దేవదాయశాఖ సిబ్బంది, ఇతర ప్రభుత్వ శాఖల సిబ్బంది వాహనాలను కొండపైకి అనుమతించరు.

● కేవలం లడ్డూ ప్రసాదాన్ని మాత్రమే కొండ దిగువన శ్రీకృష్ణాపురంలోని గోశాల, అడవివరం జంక్షన్‌, తొలిపావంచా, సింహపురి కాలనీ, శ్రీనివాసనగర్‌లోని దేవస్థానం కల్యాణ మండపాల వద్ద విక్రయిస్తారు. దర్శనానంతరం భక్తులకు ఉచితంగా 40 గ్రాముల లడ్డూని ప్రసాదంగా అందజేస్తారు. ● కొండపైన, కొండ దిగువన 20 అంబులెన్స్‌లను అందుబాటులో ఉంచారు. కొండపై కేశఖండన శాలకు సమీపంలో 6 పడకల ఆసుపత్రిని సిద్ధం చేశారు. ● కొండ దిగువన 20 ప్రదేశాల్లో, మెట్ల మార్గంలో, కొండపైన 165 ప్రదేశాల్లో తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేశారు. 4 లక్షల మంచినీటి బాటిల్స్‌తో పాటు మజ్జిగ, బిస్కెట్లు, చిన్నపిల్లలకు పాలు పంపిణీ చేయనున్నారు. ● సమాచారం కోసం 0891–2954944 నంబర్‌ను సంప్రదించవచ్చు.

భక్తుల రవాణా సదుపాయం : దేవస్థానానికి చెందిన మూడు బస్సులతో పాటు, అద్దె చెల్లించిన 90 ఆర్టీసీ బస్సుల్లో 20వ తేదీ ఉదయం ఒంటి గంట నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తారు. సాయంత్రం 6 గంటల తర్వాత కేవలం కొండపై ఉన్న భక్తులను కిందికి దించేందుకే బస్సులను అనుమతిస్తారు.

● సింహగిరిపై చెప్పులు భద్రపరిచే స్టాండ్‌లు ఉండవు. కింది పార్కింగ్‌ ప్రదేశాలు, బస్‌ పికప్‌ పాయింట్ల వద్దే చెప్పుల స్టాండ్‌లు ఏర్పాటు చేశారు.

రేపు చందనోత్సవం

Advertisement
 
Advertisement
Advertisement