నిప్పుతో సాహసం | - | Sakshi
Sakshi News home page

నిప్పుతో సాహసం

Apr 19 2026 7:17 AM | Updated on Apr 19 2026 7:17 AM

అల్లిపురం: పరిశ్రమలు, పాఠశాలలు, ఆసుపత్రులు వంటి ప్రజా ప్రాధాన్యత గల ప్రాంతాల్లో ఫైర్‌ సేఫ్టీ ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. జాతీయ అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా శనివారం ఆర్‌కే బీచ్‌ వద్ద అగ్నిప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న హోం మంత్రి, ఫైర్‌ సర్వీసెస్‌ డైరెక్టర్‌ పి.వి.రమణ, డైరెక్టర్‌ (అడ్మిన్‌) మురళి తదితరులతో కలిసి మెగా ఫైర్‌ సర్వీస్‌ డెమోను వీక్షించారు. ఈ డెమో నగరవాసులను ఆకట్టుకోవడంతో పాటు అగ్నిప్రమాదాల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను స్పష్టంగా తెలియజేసింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈనెల 14 నుంచి 20 వరకు అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజల్లో అవగాహన పెంచేందుకు ప్రదర్శనలు, డెమోలు నిర్వహిస్తున్నామని చెప్పారు. అగ్నిమాపక శాఖలో అత్యాధునిక పరికరాలు, సాంకేతికతను వినియోగిస్తున్నామని, డ్రోన్ల సహాయంతో ప్రమాద ప్రాంతాలను పర్యవేక్షిస్తున్నామని వెల్లడించారు. ఇటీవల రూ.232 కోట్లతో కొనుగోలు చేసిన ఫైర్‌ వాహనాలను సేవల్లోకి తీసుకువచ్చినట్లు పేర్కొన్నారు. చిన్న, చిన్న నిర్లక్ష్యాలు కూడా పెద్ద ప్రమాదాలకు దారి తీస్తాయని హెచ్చరించిన మంత్రి, అగ్నిమాపక సిబ్బంది విపత్తుల సమయంలో ప్రాణాలకు తెగించి సేవలందిస్తున్నారని ప్రశంసించారు. ఈ సందర్భంగా ఫైర్‌ సేఫ్టీ ప్రమాణాలు పాటిస్తున్న వివిధ విభాగాల ప్రతినిధులను మంత్రి సత్కరించారు.

Advertisement
 
Advertisement
Advertisement