గంధం అమావాస్యకుపోటెత్తిన భక్తులు
కోలల పూజలతో మార్మోగిన సింహాచలం
కిక్కిరిసిన కొండదిగువ వరాహ పుష్కరిణి
సింహాచలం: గంధం అమావాస్యను పురస్కరించుకుని శుక్రవారం శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. స్వామివారిని తమ ఇలవేల్పుగా కొలిచే ఉత్తరాంధ్ర జిల్లాలు, ఒడిశా ప్రాంతానికి చెందిన మత్స్యకారులు, గ్రామీణ ప్రాంతాల భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. గురువారం రాత్రి నుంచే తమ కుటుంబాలతో సహా సింహగిరికి చేరుకున్న భక్తులు.. శుక్రవారం తెల్లవారుజామున రెండు గంటల నుంచే కొండదిగువన ఉన్న వరాహ పుష్కరిణిలో పవిత్ర స్నానాలు ఆచరించారు. స్వామి వారి ప్రతిరూపాలుగా తమ వెంట తీసుకొచ్చిన కోలలను వరాహ పుష్కరిణి గట్టుపై ఉంచి పూజలు నిర్వహించారు. అనంతరం వంటలు వండి కోలలకు ఆరగింపు చేశారు. అమృత కలశాలు, పళ్లను నైవేద్యంగా సమర్పించి, కుటుంబసమేతంగా సహపంక్తి భోజనాలు చేశారు. మెట్లమార్గం ద్వారా నడిచి వెళ్లి స్వామిని దర్శించుకున్నారు. కోలలతో నృత్యాలు చేస్తూ స్వామిని కీర్తించారు. భక్తుల రాకతో వరాహ పుష్కరిణి ప్రాంగణం కిక్కిరిసిపోయింది. పుష్కరిణి నుంచి అడవివరం మార్కెట్ కూడలి వరకు ఉన్న మార్గం భక్తజన సంద్రంగా మారింది. సింహగిరిపై దర్శన క్యూలు, కేశఖండనశాల, ప్రసాద విక్రయశాల, గంగధార మార్గం భక్తులతో నిండిపోయాయి. దేవస్థానం ఈవో జె.వెంకటరావు పర్యవేక్షణలో ఇంజినీరింగ్ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. ఎండ తాకిడి నుంచి రక్షణ కోసం పుష్కరిణి గట్టుపై టెంట్లు, షామియానాలు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గోపాలపట్నం సీఐ సన్యాసినాయుడు ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. పుష్కరిణికి వెళ్లే మార్గంలో వాహనాల రాకపోకలను నియంత్రించారు.


