ఇక ఆగాలి! | - | Sakshi
Sakshi News home page

ఇక ఆగాలి!

Mar 25 2026 6:50 AM | Updated on Mar 25 2026 6:50 AM

ఆ గాలి..
వాయు కాలుష్య నియంత్రణకు వినూత్న పరికరం గాలి కాలుష్యం ఉన్న చోట అమర్చితే వడపోత ఏక్యూఐ లెవల్స్‌ను తగ్గిస్తున్న ఎయిర్‌ పొల్యూషన్‌ మిటిగేటింగ్‌ యంత్రం సౌర, పవన శక్తితో నడిచేలా తయారు చేసిన ‘నిటెమ్‌’సంస్థ

జైలు రోడ్డులో అమర్చిన ఎయిర్‌ పొల్యూషన్‌ మిటిగేటింగ్‌ మెషీన్‌

సాక్షి, విశాఖపట్నం: పెరుగుతున్న పట్టణీకరణ, పారిశ్రామికీకరణ కారణంగా గాలి నాణ్యత క్షీణిస్తోంది. ముఖ్యంగా నగరాల్లో ఊపిరి తీసుకోవడమే ఒక సవాలుగా మారుతోంది. ఇటీవల కాలంలో విశాఖ నగరంలో గాలి కాలుష్యం గణనీయంగా పెరిగి ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేసింది. చాలా మంది ఇళ్లలో ఎయిర్‌ ప్యూరిఫైర్స్‌ వాడుతూ కొంత ఉపశమనం పొందుతున్నారు. మరి బయటకు వస్తే.. స్వచ్ఛమైన గాలి ఎక్కడ ఉంటుంది? ఈ ప్రశ్నను సవాల్‌గా తీసుకుని విజయవాడకు చెందిన , ఓ జేఎన్‌టీయూ రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ సరికొత్త ప్యూరిఫైర్‌ను తయారు చేశారు. నిషాంత్‌ ఇన్నోవేటివ్‌ మాన్యుఫ్యాక్చర్స్‌ ఆఫ్‌ కన్‌స్ట్రక్షన్‌ మెటీరియల్‌ అండ్‌ టెక్నాలజీ(నిటెమ్‌) సంస్థ పేరుతో నగర వీధుల్లో గాలిని శుద్ధి చేసే ఈ పరికరం టెస్టింగ్‌ను విశాఖలో నిర్వహించారు. గాలిలోని విష వాయువులను, కాలుష్య కారకాలను పీల్చేసి స్వచ్ఛమైన గాలిని అందించే ‘ఎయిర్‌ పొల్యూషన్‌ మిటిగేటింగ్‌ మెషీన్‌’ను నిటెమ్‌ సంస్థ చైర్మన్‌ డా.కేఎం లక్ష్మణరావు రూపొందించారు. జేఎన్‌టీయూ ప్రొఫెసర్‌గా పనిచేసి రిటైర్‌ అయిన లక్ష్మణరావు, మెట్రో నగరాల్లో వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు ఏం చేస్తే బాగుంటుందనే ఆలోచన చేశారు. ఇందులో భాగంగా తయారు చేసిందే ఈ యంత్రం. నిటెమ్‌ రూపొందించిన ఈ పరికరాన్ని భవనాల పైనా, ప్రధాన కూడళ్లలో అమర్చడం ద్వారా 250–300 ఉన్న ఏక్యూఐను వంద లోపునకు తీసుకురావచ్చు. ఈ పరికరం కేవలం గాలిని శుద్ధి చేయడమే కాకుండా, వాతావరణ సమతుల్యతను కాపాడటంలోనూ కీలక పాత్ర పోషిస్తుంది.

గ్రీన్‌ టెక్నాలజీతో..

సౌర, పవన శక్తులతో పనిచేసే గ్రీన్‌ టెక్నాలజీని వినియోగించి పర్యావరణహితంగా ఈ యంత్రాన్ని రూపొందించారు. ఈ ఎయిర్‌ పొల్యూషన్‌ మిటిగేటింగ్‌ మెషీన్‌ అందులో అమర్చిన బ్యాటరీల ద్వారా పని చేస్తుంది. దీనికి అవసరమైన విద్యుత్‌ను సోలార్‌ ప్యానెల్స్‌, చిన్నపాటి విండ్‌ టర్బైన్ల ద్వారా ఉత్పత్తి చేసుకోవడం దీని ప్రత్యేకత.

రన్‌వేల నుంచి డ్రైనేజీ వరకు..

వీధుల్లోనూ, పరిశ్రమల్లోనే కాకుండా ఎయిర్‌పోర్టు రన్‌వేల దగ్గర నుంచి వీధుల్లో ఉన్న డ్రైనేజీల పక్కన కూడా ఈ యంత్రాన్ని వినియోగించవచ్చు. పొగమంచు కారణంగా విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం కలుగుతుంటుంది. ఈ విజిబిలిటీ సమస్యను కూడా ఈ మెషీన్‌ పరిష్కరిస్తుంది. పరిశ్రమలు, ప్లాస్టిక్‌ ఫ్యాక్టరీల నుంచి వెలువడే రసాయన వాయువులు, కాలుష్యాన్ని ఇది నియంత్రిస్తుంది. ఆసుపత్రులు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, రద్దీగా ఉండే మార్కెట్‌ ప్రాంతాల్లో గాలిని శుద్ధి చేసేందుకు ఇది ఎంతగానో ఉపయుక్తమవుతుంది. అంతేకాదు, అగ్ని ప్రమాదాల సమయంలో పొగను పీల్చేయడానికి, డ్రైనేజీ మ్యాన్‌హోల్స్‌ నుంచి వెలువడే వివిధ రకాల విషవాయువులను తొలగించేందుకు ఇది దోహదపడుతుంది.

విశాఖలో టెస్టింగ్‌ విజయవంతం

ఎయిర్‌ పొల్యూషన్‌ మిటిగేటింగ్‌ యంత్రాన్ని టెస్టింగ్‌ కోసం నగరానికి తీసుకొచ్చారు. జైలు రోడ్డు సమీపంలో మంగళవారం ఉదయం దీనిని అమర్చారు. 200 చదరపు మీటర్ల విస్తీర్ణం వరకూ గాలిని వడబోసేలా మోడ్‌ను సెట్‌ చేశారు. యంత్రం ప్రారంభించే సమయంలో ఆ ప్రాంతంలో ఏక్యూఐ లెవల్స్‌ 180 వరకూ ఉండగా, ప్రారంభించిన కొద్ది సేపటికే అది 80–90 మధ్యకు తగ్గుముఖం పట్టింది. దీంతో యంత్రం విజయవంతంగా పనిచేసినట్లు ధ్రువీకరించారు.

ప్రగతి.. పర్యావరణానికి శాపం కాకూడదు

మన పారిశ్రామిక ప్రగతి అడుగులు పర్యావరణానికి శాపం కాకూడదు. అత్యాధునిక సాంకేతికతతో కాలుష్యాన్ని మూలాల్లోనే తుడిచిపెట్టి రాబోయే తరాలకు స్వచ్ఛమైన గాలిని అందించడమే మా లక్ష్యం. అందుకే ఈ ఎయిర్‌ పొల్యూషన్‌ మిటిగేటింగ్‌ యంత్రాన్ని తయారు చేశాం. దాదాపు రెండేళ్ల పాటు దీనిపై శ్రమించాం. ఈ యంత్రం కేవలం ఒక ఆవిష్కరణ మాత్రమే కాదు, గాలి కాలుష్యంతో పోరాడుతున్న ప్రతి నగరానికి ఒక రక్షణ కవచంగా మారుతుందని భావిస్తున్నాను.

– డా. కేఎం లక్ష్మణరావు,

నిటెమ్‌ సంస్థ చైర్మన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement