మద్దిలపాలెం: ఆంధ్ర విశ్వవిద్యాలయంలో బుధవారం జరిగిన 91, 92వ సంయుక్త స్నాతకోత్సవంలో డాక్టర్ సోనీ ద్వారంపూడి ‘పెరి నారాయణ మూర్తి మెమోరియల్ గోల్డ్ మెడల్’అందుకున్నారు. గవర్నర్ డాక్టర్ ఎస్.అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా ఆమె ఈ పతకాన్ని స్వీకరించారు. డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ లా కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె.సీతా మాణిక్యం పర్యవేక్షణలో.. ‘ప్రాథమిక విద్యలో బోధనా మాధ్యమం– ఒక సామాజిక–చట్టపరమైన అధ్యయనం’అనే అంశంపై ఆమె పరిశోధన చేసి, పీహెచ్‌డీ పట్టాను పొందారు. డాక్టర్ సోనీ ద్వారంపూడి ప్రస్తుతం నగరంలో సీనియర్ సివిల్ జడ్జిగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ సందర్భంగా న్యాయశాస్త్ర అధ్యాపక బృందం, తోటి విద్యార్థులు ఆమెను అభినందించారు.


