ఖజానా ఖాళీ | - | Sakshi
Sakshi News home page

ఖజానా ఖాళీ

Mar 26 2026 7:16 AM | Updated on Mar 26 2026 7:16 AM

● బోసిపోతున్న ట్రెజరీ కార్యాలయం ● నిధుల కటకటతో చెల్లింపులు బంద్‌ ● కేంద్ర నిధుల బిల్లులకు మాత్రమే మోక్షం

మహారాణిపేట: ఆర్థిక సంవత్సరం ముగింపు (మార్చి) అనగానే ట్రెజరీ(ఖజానా) కార్యాలయాలు బిల్లుల క్లియరెన్స్‌తో కిటకిటలాడుతుంటాయి. కానీ, ఈ ఏడాది పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. రాష్ట్రంలో నెలకొన్న తీవ్ర ఆర్థిక సంక్షోభం, నిధుల కొరత కారణంగా ఖజానా కార్యాలయాలు వెలవెలబోతున్నాయి. ఆదాయం గణనీయంగా తగ్గి, వ్యయాలు పెరిగిపోవడంతో.. కేవలం ఉద్యోగుల జీతాలు, పెన్షనర్ల పింఛన్లు మినహా మిగతా అన్ని రకాల చెల్లింపులను ప్రభుత్వం పూర్తిగా నిలిపివేసింది. సంపద సృష్టికర్త చంద్రబాబు హయాంలో ఇలా జరగడం గమనార్హం. ఆదాయం తగ్గి.. వ్యయాలు భారీగా పెరిగిపోతుండడమే ఇందుకు కారణమని పలువురు పేర్కొంటున్నారు.

అర్ధరాత్రుల వరకు పనిచేసే చోట.. స్తబ్ధత

సాధారణంగా మార్చి చివరి వారంలో బడ్జెట్‌ నిధులు మురిగిపోకుండా చూసుకునేందుకు వివిధ ప్రభుత్వ శాఖలు పెద్ద ఎత్తున బిల్లులు సమర్పిస్తుంటాయి. వీటిని పరిశీలించి సీఎఫ్‌ఎంఎస్‌ పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేయడానికి ట్రెజరీ సిబ్బంది అర్ధరాత్రి వరకు పనిచేసేవారు. కానీ ప్రస్తుతం అప్‌లోడ్‌ చేయడానికి ఫైళ్లు, క్లియర్‌ చేయడానికి నిధులు లేకపోవడంతో సిబ్బంది సైతం ఖాళీగా కూర్చునే పరిస్థితి నెలకొంది. కాంట్రాక్టర్లు, ఇతర శాఖల అధికారుల రాక లేకపోవడంతో ట్రెజరీ ఆఫీసు పూర్తిగా బోసిపోయింది.

నిలిచిపోయిన చెల్లింపులు ఇవే..

గత ఫిబ్రవరి నుంచే అన్ని రకాల బిల్లులను నిలిపివేయాలని ఆర్థిక శాఖ ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వ నిధులతో జరిగే పనులకు సంబంధించిన బిల్లులు మినహా, రాష్ట్ర సర్కార్‌ పరిధిలోని చెల్లింపులన్నీ ఫ్రీజ్‌ అయ్యాయి. జిల్లాలోని 32 ప్రభుత్వ శాఖలకు సంబంధించిన కరెంటు, టెలిఫోన్‌, స్టేషనరీ తదితర రోజువారీ కార్యాలయ నిర్వహణ ఖర్చుల చెల్లింపులు బంద్‌ అయ్యాయి. దీంతో ఆయా శాఖలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. ఇక జీతాలు అందుతున్నప్పటికీ.. ఉద్యోగులకు చెల్లించాల్సిన రవాణా, కరువు భత్యాలు, ఏళ్ల తరబడి దాచుకున్న జీపీఎఫ్‌ అడ్వాన్సులు, పదవీ విరమణ పొందిన వారికి రావాల్సిన రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ సైతం పెండింగ్‌లోనే పడ్డాయి. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనుల్లో పాల్గొన్న కాంట్రాక్టర్ల బిల్లులు మురిగిపోతున్నాయి.

మళ్లీ బిల్లు పెడితే చర్యలే!

నిధుల కొరత తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ఆర్థిక శాఖ అధికారులకు స్పష్టమైన హెచ్చరికలు జారీ చేసినట్లు సమాచారం. సీఎఫ్‌ఎంఎస్‌ పోర్టల్‌లో ఒకసారి రిజెక్ట్‌ అయిన బిల్లులను అధికారులు పదేపదే ట్రెజరీకి పంపితే, సంబంధిత డ్రా యింగ్‌ అండ్‌ డిస్బర్స్‌మెంట్‌ ఆఫీసర్ల్ల(డీడీవో)పై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది. దీంతో ఏ శాఖాధికారి కూడా బిల్లులు సమర్పించే సాహసం చేయడం లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement