రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు

Mar 26 2026 7:16 AM | Updated on Mar 26 2026 7:16 AM

మహారాణిపేట: జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు సంబంధిత శాఖలు సమన్వయంతో పటిష్ట చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ ఎం.ఎన్‌.హరేందిర ప్రసాద్‌ సూచించారు. పోలీస్‌ కమిషనర్‌ శంఖబ్రత బాగ్చితో కలిసి బుధవారం కలెక్టరేట్‌లో జరిగిన రోడ్డు సేఫ్టీ కమిటీ సమావేశంలో ఆయన పలు అంశాలపై సమీక్ష నిర్వహించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై విస్తృతంగా చర్చించారు. డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్‌ కమిషనర్‌ ఆర్‌.సిహెచ్‌. శ్రీనివాసరావు గత రెండేళ్లతో పోల్చితే ఈ ఏడాది ప్రమాదాలు తగ్గినట్టు నివేదికలు సమర్పించారు.

స్పీడ్‌ బ్రేకర్లపై పునఃపరిశీలన

జిల్లాలో ఏర్పాటు చేసిన స్పీడ్‌ బ్రేకర్ల అవసరం, ప్రయోజనాలు, దుష్ప్రయోజనాలపై జీవీఎంసీ, ఆర్టీసీ, పోలీసు, రవాణా శాఖలు సంయుక్తంగా పునఃపరిశీలన చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. అవసరం లేని చోట వాటిని తొలగించాలని సూచించారు. ర్యాష్‌ డ్రైవింగ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని, నిబంధనల అమల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడొద్దని స్పష్టం చేశారు. జాతీయ రహదారులపై పాదచారుల క్రాసింగ్‌ల వద్ద తప్పనిసరిగా సూచిక బోర్డులు, వాహనదారులకు స్పష్టంగా కనిపించేలా బ్లింకర్స్‌ ఏర్పాటు చేయాలని ఎన్‌హెచ్‌ఏఐ అధికారులకు ఆదేశించారు.

హనుమంతవాక జంక్షన్‌ విస్తరణ

హనుమంతవాక జంక్షన్‌ విస్తరణ, అండర్‌పాస్‌ నిర్మాణంపై సమీక్షించిన కలెక్టర్‌ జూ పార్క్‌ వైపు నుంచి వచ్చే మార్గంలో, అలాగే కై లాసగిరి నుంచి హైవేకు వెళ్లే దిశలో ఫ్రీ లెఫ్ట్‌లను విస్తరించాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల సమయంలో సహాయం చేసే వారికి నగదు ప్రోత్సాహకాలు అందించాలన్నారు.

నగరంలో మౌలిక వసతుల మెరుగుదల

జీవీఎంసీ పరిధిలో రోడ్డు విస్తరణ, జంక్షన్‌ల అభివృద్ధి, డివైడర్లు, ఇనుప గ్రిల్స్‌ ఏర్పాటు పనులను గడువులోపు పూర్తి చేయాలని ఆదేశించారు. ఎయిర్‌పోర్టు నుంచి గాజువాక వైపు సర్వీస్‌ రోడ్డు విస్తరణపై సంబంధిత శాఖలు చర్చించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. రోడ్ల మధ్యలో ప్రకటన బోర్డులు ఏర్పాటు చేయరాదని స్పష్టం చేశారు. షాపింగ్‌ కాంప్లెక్సుల్లో సెల్లార్‌ పార్కింగ్‌ను ప్రోత్సహించాలని, రోడ్లపై అనియంత్రిత పార్కింగ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు, జీవీఎంసీ అధికారులను ఆదేశించారు. విశాఖ వ్యాలీ, పోర్టు రోడ్లలో నైట్‌ పెట్రోలింగ్‌ పెంచాలని, భవన వ్యర్థాల పారవేయడాన్ని నియంత్రించాలని చెప్పారు. ఆర్టీసీ బస్సు డ్రైవర్లకు అవసరమైతే కౌన్సిలింగ్‌ ఇవ్వాలని సూచించారు.

బైక్‌ రేసింగ్‌ల నియంత్రణపై సీపీ సూచనలు

రోడ్డు ప్రమాదాల నియంత్రణకు స్పీడ్‌ లేజర్‌ గన్‌లు అవసరమని పోలీస్‌ కమిషనర్‌ శంఖబ్రత బాగ్చి తెలిపారు. రాత్రి వేళల్లో బైక్‌ రేసింగ్‌లను అరికట్టడంలో అవి కీలకంగా ఉంటాయని పేర్కొన్నారు. నిబంధనలు అతిక్రమించిన వాహనదారుల లైసెన్సుల రద్దుకు రవాణా శాఖ మరింత సహకారం అందించాలని కోరారు. సమావేశంలో డీసీపీ మణికంఠ చందోలు, ఆర్టీవో సూర్యప్రకాశ్‌, ఆర్టీసీ ఆర్‌ఎం అప్పలనాయుడు, ఎంవీఐలు బుచ్చిరాజు, దుర్గాప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

రోడ్డు సేఫ్టీ కమిటీ సమావేశంలో

కలెక్టర్‌ ఎం.ఎన్‌.హరేందిర ప్రసాద్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement